కరోనాపై పోరులో భారత ప్రభుత్వానికి సహకారాన్ని కొనసాగించినట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు(ఏడీబీ) ప్రకటించింది. కరోనా సంబంధిత 13 ప్రాజెక్టులకు అత్యవసర సహాయంగా రికార్డు స్థాయిలో దాదాపు 3.92 బిలియన్ డాలర్ల రుణ సహాయాన్ని అందించినట్లు పేర్కొంది. మహమ్మారి సమయంలో పేద, బలహీన వర్గాలకు తక్షణ ఉపశమనం కలిగించేలా సామాజిక రక్షణ చర్యలు చేపట్టినట్లు వివరించిన ఏడీబీ.. 1986లో రుణ కార్యకలాపాలు ప్రారంభమైన నాటి నుంచి భారత్కు అందించిన వార్షిక రుణాల్లో ఇదే అత్యధికమని స్పష్టం చేసింది.
"భారత్లో కరోనా సంబంధిత సవాళ్ల పరిష్కారంలో అదనపు వనరులను అందించేందుకు ఏడీబీ సిద్ధంగా ఉంది. దేశంలో కొనసాగుతున్న టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడం సహా.. ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠత, చిన్న వ్యాపారాల సంరక్షణ, విద్య , సామాజిక అంశాల్లో సహకారాన్ని కొనసాగిస్తుంది."
-టేకో కొనిషి, భారత్లో ఏడీబీ డైరెక్టర్