ఈ ఏడాది దేశ ప్రజలందరికీ.. కరోనా వ్యాక్సిన్ అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా చెప్పారు. దేశంలో ఈనెల 16 నుంచి పంపిణీ కోసం.. పుణెలోని సీరం సంస్థ నుంచి 13 నగరాలకు వ్యాక్సిన్ను మంగళవారం తరలించడాన్ని ఓ చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. ప్రతి నెలా 7 నుంచి 8 కోట్ల డోసులు తయారు చేయనున్నట్లు పూనావాలా వివరించారు. ఒక్కో డోసు రెండు వందల రూపాయల చొప్పున.. మొత్తం 10 కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నట్లు వివరించిన ఆయన.. తర్వాత ప్రైవేటులో వెయ్యి రూపాయల చొప్పున విక్రయిస్తామని తెలిపారు.
అందరికీ పెద్ద ఊరట కలిగించే అంశం. కొద్దినెలలుగా సీరం సంస్థ, ప్రభుత్వ అధికారులు, విభాగాలు నిరంతరం శ్రమించాయి. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, అభివృద్ధి, ఉత్పత్తి, స్టాక్ నిల్వల కోసం కృషిచేశాం. ఇవాళ గొప్ప దినంగా చెప్పవచ్చు. మా ఉత్పత్తి కేంద్రం నుంచి ఉదయం వ్యాక్సిన్ ట్రక్కులు బయటకు వెళ్లాయి. ఈ ఏడాదిలో వీలైనన్ని ఎక్కువ డోసులు ఉత్పత్తి చేసి, అవసరమైనవారికి అందించడం.. సవాలుతో కూడుకున్న పని. వచ్చే నెలల్లో దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేసేందుకు కృషిచేస్తాం.