'వచ్చే రెండు దశాబ్దాల్లో మనదేశం 15 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కాబోతోంది' అని అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. మనదేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న మధ్య తరగతి ప్రజల వినియోగం దీన్ని సాధ్యం చేస్తుందని అన్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ వార్షిక సమావేశం (ఏజీఎం) లో ఆయన మన దేశ ఆర్థిక వ్యవస్థ, అవకాశాలు, అదానీ గ్రూపు లక్ష్యాలపై మాట్లాడారు. కొవిడ్-19 మధ్య తరగతి ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఇబ్బందులకు గురిచేసిన విషయం విదితమే. అయినప్పటికీ దీన్ని నుంచి త్వరలో కోలుకుంటామని, తత్ఫలితంగా రెండు దశాబ్దాల్లో 15 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థగా మనదేశం ఎదుగుతుందని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలోనే 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఏదైనా ఒక ఉపద్రవం నుంచి మనం ఎంతో నేర్చుకుంటాం, దాన్ని అధిగమిస్తాం, ఇప్పుడు కూడా అదే జరగబోతోంది- అన్నారాయన. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ మార్కెట్‌గా మనదేశం ఆవిర్భవిస్తుందని అని ధీమా వ్యక్తం చేశారు.
'మారిషస్ సంస్థల పెట్టుబడికి వక్రభాష్యం'
అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలు ఇటీవల కాలంలో స్టాక్‌మార్కెట్లో ఒత్తిడికి గురికావటంపై స్పందిస్తూ, వాస్తవాలను వక్రీకరించటమే దీనికి కారణమన్నారు. మారిషస్‌కు చెందిన ఆరు పెట్టుబడి సంస్థలు తమ పెట్టుబడి మొత్తాల్లో అధిక భాగం అదానీ గ్రూపు షేర్లలో పెట్టుబడి పెట్టటం, అందులో మూడు సంస్థల షేర్లను 'ఫ్రీజ్' చేశారనే ఆరోపణలు రావటంతో అదానీ షేర్ల ధరలు కుంగిపోయాయి. ఈ మూడు పెట్టుబడి సంస్థలు అదానీ గ్రూపు కంపెనీల్లో 5 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడి పెట్టాయి. అదానీ గ్రూపు కంపెనీల్లో విదేశీ సంస్థలకు ఉన్న షేర్లను 'ఫ్రీజ్' చేశారనే నివేదికలు నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో కూడినవి- అన్నారాయన. దీనివల్ల మా కంపెనీల్లోని చిన్న ఇన్వెస్టర్లు నష్టపోయారని వివరించారు. ఇటువంటి ఉదంతాలు భవిష్యత్తులో తమపై ప్రభావం చూపలేవని పేర్కొన్నారు. దీర్ఘకాలంలో తమ వ్యాపార భాగస్వాములు, ఇన్వెస్టర్లకు భవిష్యత్తులో సంపద సృష్టించటానికి కృషి చేస్తామని తెలిపారు.