Adani and Ambani net worth: ఆసియా కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ.. గతేడాదిలో తన సంపదకు ఏకంగా 49 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.67 లక్షల కోట్ల)ను (మారకపు విలువ రూ.75 ప్రకారం) జత చేశారు. అంటే సగటున రోజుకు రూ.1,000 కోట్లు సంపాదించారన్నమాట. '2022 ఎమ్3ఎమ్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్'లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంటే అదానీ ఎక్కువ సంపాదించారు. బుధవారం వెల్లడైన ఈ జాబితా ప్రకారం..
10 ఏళ్లలో అంబానీ, అదానీ ఇలా
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ 103 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7.72 లక్షల కోట్ల) సంపదతో భారత్‌లో అగ్రస్థానంలో కొనసాగారు. 2020తో పోలిస్తే ఆయన సంపద 24 శాతం పెరిగింది. అదానీ గ్రూపు అధినేత అదానీ(59) సంపద విలువ 153 శాతం పెరిగి 81 బి. డాలర్ల (సుమారు రూ.6.07 లక్షల కోట్ల)కు చేరుకోవడంతో దేశీయంగా రెండో స్థానంలో నిలిచారు. గత 10 ఏళ్లలో అంబానీ సంపద విలువ 400%, అదానీ సంపద 1830% వృద్ధి చెందింది. అదానీ గ్రీన్ కంపెనీ లిస్టింగ్ సమయం(2020)లో 17 బి. డాలర్లుగా ఉన్న అదానీ సంపద విలువ రెండేళ్లలోనే దాదాపు అయిదు రెట్లు పెరిగింది. అంతర్జాతీయ కుబేరుల జాబితాలో అంబానీ 9, అదానీ 12వ స్థానాల్లో ఉన్నారు. అంబానీ సంపద అయిదేళ్ల కిందట 45 బి.డాలర్లు, 10 ఏళ్ల కిందట 20.5 బి. డాలర్లుగా ఉంది. అదానీ సంపద అయిదేళ్ల కిందట 14 బి.డాలర్లు; 10 ఏళ్ల కిందట 8.8 బి. డాలర్లుగా ఉంది.
3,381 మంది బిలియనీర్లు
- 69 దేశాల్లోని 2557 కంపెనీలకు చెందిన 3381 మంది బిలియనీర్లు ఈ జాబితాలో ఉన్నారు.
- బిలియనీర్ల సంఖ్యలో చైనా(1133), అమెరికా(716) తర్వాత భారతే(215) ఉంది. ఏడాదిలో కనీసం 1 బి.డాలర్ల (సుమారు రూ.7500 కోట్ల) సంపదను జత చేసుకున్న వారి సంఖ్యలో భారత్ మూడో స్థానంలో నిలిచింది.
- గత 10 ఏళ్లలో భారత కుబేరులు తమ సంపదకు 700 బిలియన్ డాలర్ల (రూ.52.50లక్షల కోట్ల)ను జత చేసుకున్నారు.
- ప్రపంచ జనాభాలో 18 శాతం; ప్రపంచ బిలియనీర్లలో 8 శాతం భారత్‌లోనే ఉన్నారు. అయిదేళ్ల కిందట అంతర్జాతీయ కుబేరుల్లో భారత వాటా 4.9 శాతమే.