తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ రోజే చివరి తేదీ.. ఆదాయపు పన్ను లెక్క చూసుకోండి - fixed deposits

Aadhar pan link last date: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల మార్చి 31తో ముగియనుంది. ఈ గడువులోపు ఆదాయపు పన్ను విభాగం నిబంధనల మేరకు అందరూ తమ పాన్​, ఆధార్​ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకపోతే ఏం అవుతుంది. పన్ను మినహాయింపు కోసం ఏం చేయాలి?

financial year last date
ఆర్థిక సంవత్సరం చివరి తేదీ

By

Published : Mar 18, 2022, 12:01 PM IST

Aadhar pan link last date: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను మినహాయింపు పొందేందుకు పెట్టుబడులు పెట్టడం, ఆర్జించిన ఆదాయాలను సరిగా లెక్కించడంలాంటి పనులన్నీ ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో సాధారణంగా పన్ను చెల్లింపుదారులు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవేమిటి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం.. ఆదాయపు పన్ను విభాగం నిబంధనల మేరకు అందరూ తమ పాన్‌, ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలి. దీనికి చివరి తేదీ మార్చి 31. ఆలోపు ఈ రెండింటినీ జత చేయకపోతే కొత్త ఆర్థిక సంవత్సరంలో పాన్‌ చెల్లదు.

ఆదాయం ఎంతుంది?

పన్ను వర్తించే ఆదాయం ఎంతుందో ముందుగా లెక్క వేయాలి. దీనికోసం మీకు వచ్చిన ప్రతి ఆదాయాన్నీ కలపాలి. దీనివల్ల మీరు ఎంత పన్ను చెల్లించాలన్నది తెలుస్తుంది. చాలామంది పన్ను చెల్లింపుదారులు తమకు వచ్చిన కొన్ని ఆదాయాలను పట్టించుకోరు. ముఖ్యంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు, పన్ను ఆదా ఎఫ్‌డీల ద్వారా వచ్చిన వడ్డీని మొత్తం ఆదాయంలో కలిపి చూపించాలి. బ్యాంకులు వడ్డీపై 10శాతం టీడీఎస్‌ చేస్తాయి కాబట్టి, ఇక పన్ను చెల్లించక్కర్లేదనే అపోహ కొందరిలో ఉంటుంది. ఇది మొత్తం పన్ను కాదని గుర్తించాలి. పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు వర్తించే శ్లాబులను బట్టి, మిగతా పన్ను చెల్లించాలి. అందువల్ల ముందుగానే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొదుపు ఖాతా నుంచి వడ్డీ వచ్చినప్పుడు రూ.10వేల వరకే మినహాయింపు వర్తిస్తుంది. అంతకు మించి వచ్చినప్పుడు వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాలి. లిక్విడ్‌ ఫండ్ల నుంచి వచ్చిన స్వల్పకాలిక రాబడినీ పన్ను గణనలో లెక్కలోకి తీసుకోవాలి. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షల లోపున్నప్పుడు ఎలాంటి పన్నూ వర్తించదు. ఈ విషయాన్ని సరిగా గమనించక.. పన్ను ప్రణాళికలో పొరపాట్లు చేస్తే.. రూ.5లక్షలకు అదనంగా రూ.100 ఉన్నా.. కనీసం రూ.12,500 పన్ను చెల్లించాల్సిందే

సెక్షన్‌ 80సీ పూర్తయ్యిందా?

పన్ను ప్రణాళికలో కీలకం సెక్షన్‌ 80సీ. దీని ప్రకారం రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో మదుపు చేయడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఇందులో ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌, పీపీఎఫ్‌, జీవిత బీమా ప్రీమియం, గృహరుణం అసలు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఎన్‌ఎస్‌సీ, ఇంటి రిజిస్ట్రేషన్‌ చెల్లించిన ఫీజు ఇలా ఎన్నో ఉంటాయి. మీరు ఈ సెక్షన్‌ కింద ఏయే పథకాల్లో మదుపు చేశారో ఒకసారి చూసుకోండి. ఇప్పటికీ కొంత మొత్తం మిగిలి ఉంటే.. సాధ్యమైతే దాన్ని మదుపు చేసేందుకు ప్రయత్నించండి. దీనికోసం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌), లేదా జాతీయ పొదుపు పత్రాలు ఎంచుకోవచ్చు. పన్ను ఆదా కోసం అప్పు చేసి, మదుపు చేయడం పెద్ద పొరపాటు.

లక్ష్యసాధనలో తోడుండేలా..

ప్రతి పెట్టుబడి పథకానికీ ఒక లక్ష్యం ఉండాలి. పన్ను ఆదా పథకాల ఎంపికలోనూ ఈ సూత్రం మర్చిపోకూడదు. పన్ను ఆదా అనేది ఒక అదనపు ప్రయోజనం మాత్రమే. ఉదాహరణకు సెక్షన్‌ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 వరకూ జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో మదుపు చేయొచ్చు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. పదవీ విరమణ ప్రణాళికలో భాగంగానే దీన్ని ఎంచుకోవాలి. 60 ఏళ్ల వయసు వరకూ డబ్బు వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి, రూ.50వేలతో అవసరం లేదు అనుకున్నప్పుడే ఇందులో మదుపు చేయాలి. యూనిట్‌ ఆధారిత పథకాలు ఈ సమయంలో అధికంగా వస్తుంటాయి. వీటిని ఎంపిక చేసుకునేటప్పుడూ దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. ఎండోమెంట్‌ పాలసీల్లాంటివి తగిన బీమా రక్షణ ఇవ్వవు. ఈ విషయాలన్నీ ఒకటికి రెండుసార్లు చూసుకున్నాకే తగిన నిర్ణయం తీసుకోవాలి.

వివరాలన్నీ ఇచ్చారా?

పెట్టుబడులు పెట్టడమే కాదు.. వాటికి సంబంధించిన వివరాలన్నీ మీ కార్యాలయంలో తెలియజేయడమూ అంతే ముఖ్యం. లేకపోతే వాటిని లెక్కలోకి తీసుకోకుండానే మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధిస్తారు. ఇలాంటి సమస్య లేకుండా ప్రతి పెట్టుబడినీ నమోదు చేయించండి. ఇంటిరుణానికి సంబంధించిన వడ్డీ, అసలు చెల్లింపు ధ్రువీకరణ పత్రాలను అందించాలి. ఆరోగ్య బీమా ప్రీమియం (సెక్షన్‌ 80డీ), విద్యా రుణానికి చెల్లించిన వడ్డీ (సెక్షన్‌ 80ఈ) కింద మినహాయింపు ఉంటుంది. సీనియర్‌ సిటిజన్లయిన తల్లిదండ్రులకు ఆరోగ్య బీమా లేకపోతే రూ.50వేల వరకూ వైద్య ఖర్చులకు చెల్లించిన మొత్తాన్ని క్లెయిం చేసుకోవచ్చు.

పన్ను రిటర్నులు గతంతో పోలిస్తే ఎంతో సులువయ్యాయి. అదే సమయంలో ప్రతి ఆదాయాన్నీ పన్ను విభాగం గమనిస్తూనే ఉందన్న సంగతి మర్చిపోవద్దు. కాబట్టి, పొరపాట్లకు తావీయకుండా నిబంధనల మేరకు ఆదాయపు పన్ను చెల్లించడం మన బాధ్యత. చట్టం కల్పించిన మినహాయింపులన్నీ సాధ్యమైనంత మేరకు వాడుకొని, పన్ను భారం తగ్గించుకునే ప్రయత్నం చేయడం మర్చిపోవద్దు.

ఇదీ చదవండి:క్రెడిట్​ కార్డు.. విదేశీ ప్రయాణాల్లో మనకు తోడుగా

ABOUT THE AUTHOR

...view details