ఆధార్.. ప్రతి భారతీయుని విశిష్ట గుర్తింపు. 12 అంకెలతో భారతీయ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఆధార్ నంబర్‌ను దేశంలోని ప్రతి ఒక్కరికీ అందిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ చిన్నపిల్లల కోసం బాల్ ఆధార్‌ను తీసుకువచ్చింది. దీనితో నవజాత శిశువులకు కూడా ఆధార్ కార్డును నమోదు చేసుకునే వీలు కలగనుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులు నీలి రంగులో ఉండే 'బాల్ ఆధార్'ను పొందవచ్చని యూఐడీఏఐ తెలిపింది. చిన్నారి ఐదేళ్లు పూర్తి చేసుకుంటే ఆ కార్డ్ చెల్లదని స్పష్టం చేసింది. ఆ కార్డును తిరిగి రీయాక్టివేట్ చేయించుకోవడం తప్పనిసరి అని పేర్కొంది. ఇందుకుగానూ బయోమెట్రిక్ అవసరమని ట్వీట్ చేసింది.
బాల్ ఆధార్ కూడా పెద్దవాళ్లకు ఇచ్చే కార్డు లాంటిదే. చిన్నారికి ఆ కార్డు చేయించాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు ఆధార్ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారి నుంచి ఎటువంటి బయోమెట్రిక్ సమాచారాన్ని తీసుకోరు. వారికి కార్డుని ఉచితంగా అందిస్తారు. రీయాక్టివ్ చేయించుకునే సమయంలో కచ్చితంగా వేలి ముద్రలు, ఫొటో, కనుబొమ్మలను స్కాన్ చేస్తారు.
కావాల్సిన పత్రాలు ..
- చిన్నారి జనన ధ్రువపత్రం లేదా బడిలో చదివే పిల్లలు అయితే స్కూల్ యాజమాన్యం ద్రువీకరించిన ఫొటో
- తల్లిదండ్రుల ఆధార్ కార్డు వివరాలు