'ద ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్’.. ముద్దుగా ఐబీఎం అని పిలుచుకునే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంటే ఎంతో ముందుగానే ఏర్పాటైంది. ఒకప్పుడు కంప్యూటర్లు అంటే ఐబీఎంవే. కానీ, దీనిలో పనిచేసిన ఒక ఉద్యోగి వేరుపడి ఏర్పాటు చేసిన సంస్థ ఇప్పుడు ఐబీఎంను దాటేసింది. ఆ ఉద్యోగే బిల్‌గేట్స్.. ఆ సంస్థపేరు మైక్రోసాఫ్ట్.
ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా ఒక వెలుగు వెలిగిన మైక్రోసాఫ్ట్ ఆ తర్వాత షేర్ హోల్డర్లను సంతృప్తి పర్చలేకపోయింది. మొబైల్ విప్లవం.. ఆండ్రాయిడ్ రాకతో కొంత వెనుకపడింది. దీంతో ఈ కంపెనీ పగ్గాలను మన తెలుగు వాసి సత్యనాదెళ్లకు అప్పగించారు. ఫలితంగా కంపెనీ వ్యాపారం మళ్లీ పుంజుకొని దూసుకెళుతోంది. ఇప్పుడు ఐబీఎం వంతు వచ్చింది. సీఈఓ వర్జీనియా గిన్ని రొమెట్టి(62) నేతృత్వంలో ఈ సంస్థ ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఇప్పుడు కంపెనీ పగ్గాలను మరో ఆంధ్రుడు అరవింద్ కృష్ణాకు అప్పగించాలని నిర్ణయించింది.
సిలికాన్ వ్యాలీలో కంప్యూటర్ విప్లవానికి కారణమైన రెండు కీలక సంస్థలకు భారతీయులు.. అందులో మన తెలుగువారు నాయకత్వం వహించడం విశేషం. అంతేకాదు అమెరికాలో జీవనాడుల్లాంటి అతిపెద్ద కంపెనీల్లో పదింటికి మన భారతీయులే నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా కంపెనీలను భారతీయులు ఆకర్షించడానికి కారణం ఉంది. మన వారి పని సంస్కృతి, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం, సృజనాత్మకత వంటి లక్షణాలు టెక్ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాయి.
భారతీయులు నాయకత్వం వహిస్తున్న దిగ్గజ కంపెనీలు ఇవే..
- అడోబ్- శంతను నారాయణన్
- ఆల్ఫాబెట్, గూగుల్- సుందర్ పిచాయ్
- మైక్రోసాఫ్ట్- సత్య నారాయణ నాదెళ్ల(సత్య నాదెళ్ల)
- నోకియా - రాజీవ్ సూరి
- డెలాయిట్ - పూనిత్ రంజన్
- నోవార్టిస్ - వసంత్ నరసింహన్ (వస్)
- మాస్టర్ కార్డ్ - అజయ్ పాల్ సింగ్ బంగా
- డియా జియో - ఇవాన్ మాన్యూయల్
- వేఫెయిర్ - నీరజ్ ఎస్. షా
- మైక్రాన్ - సంజయ్ మెహ్రోత్రా
- నెట్ యాప్ - జార్జి కురియన్
- పాల్ ఆల్టో నెట్‌వర్క్ - నిఖేష్ అరోరా
- హర్మాన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ - దినేష్ సి పాలివాల్
- ఐబీఎం - అరవింద్ కృష్ణా (ఏప్రిల్6 నుంచి)
- వుయ్‌వర్క్ - సందీప్ మత్రాని (ఫిబ్రవరి 18 నుంచి)
కీలకమైన ఈ కంపెనీల్లో భారతీయులు సీఈఓల స్థాయికి చేరడానికి చాలా కారణాలు ఉన్నాయి. గ్లోబలైజేషన్‌కు అమెరికా సమాజం నిలువెత్తు రూపం. పలు దేశాల ప్రజలు.. జాతుల వారు అక్కడ స్థిరపడి దేశాభివృద్ధికి కృషి చేశారు. ఈ ట్రెండ్ ముఖ్యంగా బహుళజాతి కంపెనీల్లో కనబడుతుంది.
గతంలో పెప్సీకి ఇంద్రా నూయి.. సిస్కోలో పద్మశ్రీవారియర్ కూడా కీలక స్థానాల్లో పనిచేశారు. కోకాకోలా వంటి కంపెనీలను ఎదుర్కోంటూ పెప్సీని ప్రపంచస్థాయికి చేర్చడంలో ఇంద్రా నూయి పాత్ర వెలకట్టలేనిది. కంపెనీ కష్టకాలంలో భారతీయులు బాగా పనిచేస్తారనే పేరు తీసుకురావడానికి ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి. భారతీయులను సీఈవోలుగా ఎంచుకోవడానికి కారణాలను నిపుణులు విశ్లేషించారు..
సమాజంలో ఒడుదొడుకులు ఎదుర్కొని..
భారత్ 100 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం. ఇక్కడ డజన్ల కొద్దీ భాషలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి విషయంలో విపరీతమైన పోటీని ఎదుర్కొని గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో వేగంగా మారే సామాజిక రాజకీయ పరిస్థితులు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. దీంతో ఇక్కడ చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్నవారు.. వాస్తవ పరిస్థితులను అంగీకరించే మనస్తత్వాన్ని ఏర్పర్చుకుంటారు. ఈ క్రమంలో భారీగా పోటీని ఎదుర్కొని గెలిచేందుకు సృజనాత్మకత, ఓపికగా ఎదురు చూసే తత్వం వారు అలవర్చుకుంటారు. దీంతో కార్పొరేట్ బ్యూరోక్రసీలో వీరు మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంది.
కత్తికి రెండువైపులా పదును పెడతారు..
భారతీయులకు ముందుచూపు చాలా వ్యూహాత్మకంగా ఉంటుందనే పేరుంది. భారతీయులు సమాచారం సేకరించడంలో మాస్టర్లు. వారు ఆ సమాచారాన్ని ఒక వ్యూహం ప్రకారం సిద్ధం చేస్తారు. అది పనిచేయకపోతే ఏమి చేయాలో కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకొంటారు. సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో వుయ్‌వర్క్ భవిష్యత్తు సీఈఓ మాత్రాని ఇలాంటి వ్యూహాలనే వివరించి ఆశ్చర్యపర్చాడు.