కరోనా సంక్షోభం ముందు కన్నా ఎక్కువగా వర్క్ ఫ్రం హోం చేసేందుకు 74 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నట్లు ఓ సర్వేలో తెలింది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రం హోం అంశంపై ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో సర్వే నిర్వహించింది.
వర్క్ ఫ్రం హోంకే 74% ఉద్యోగులు మొగ్గు! - కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోంకే ఉద్యోగుల ప్రాధాన్యత
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడం కన్నా.. వర్క్ ఫ్రం హోం చేసుకోవడమే మేలని భావిస్తున్నారు ఉద్యోగులు. ఈ విషయంపై కంప్యూటర్ల తయారీ సంస్థ లెనోవో చేసిన తాజా సర్వేలో 74 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్వే ద్వారా తెలిసిన మరిన్ని కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
వర్క్ ఫ్రం హోంపై ఉద్యోగుల్లో పెరిగిన ఆసక్తి
సర్వేలో ముఖ్యాంశాలు..
- సర్వేలో పాల్గొన్న 62 శాతం మంది కొత్త టెక్నాలజీలతో తమ ఉద్యోగాలకు ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
- భారత్లో 82 శాతం మంది వ్యక్తిగత డేటా రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
- కరోనా కన్నా ముందుతో పోలిస్తే ఇప్పుడు ల్యాప్టాప్లు వినియోగించడం గణనీయంగా పెరిగిందని 91 శాతం మంది భారతీయ ఉద్యోగులు చెప్పారు. ప్రపంచ సగటు కన్నా ఇది 85 శాతం ఎక్కువ.
- వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న భారతీయ ఉద్యోగుల్లో 81 శాతం మంది తమ పనిలో సమూల మార్పులు వచ్చినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 71 శాతం మంది ఇదే విషయం చెప్పారు.
- కొత్త కొత్త టెక్నాలజీలతో వర్క్ ఫ్రం హోంలో తమ ఉత్పాదకత పెరిగిందని 78 శాతం మంది తెలిపారు. 84 శాతం మంది తమకు టెక్నాలజీపై ఉన్న అవగాహనతో వర్క్ ఫ్రం హోం సులభతరమైందని చెప్పుకొచ్చారు.
- వ్యక్తిగత అవసరాలకు, ఉద్యోగ అవసరాలకు వేర్వేరుగా ల్యాప్టాప్లు/కంప్యూటర్లు ఉండాలని 70 శాతం భారతీయ ఉద్యోగులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతనం పెంపు