ఎక్కువ జీతం ఏ ఉద్యోగం చేస్తే వస్తుంది? ఈ ప్రశ్న వినగానే అందరూ చెప్పేది ఐటీ సెక్టార్. అయితే అది ఒక కోణం మాత్రమే. సాఫ్ట్వేర్ రంగానికి దీటుగా.. ఆధునిక ప్రపంచంలో ఎక్కువ వేతనాలు ఇచ్చే అనేక ప్రొఫెషన్స్ పుట్టుకొచ్చాయి. కొన్ని ఉద్యోగాలు అసలు చేసినట్లుగా ఉండవు.. కానీ ఆ పనులకు భారీగా వేతనాలు ఉంటాయి. అలాంటి ఉద్యోగాలు వాటి వేతనాల వివరాలు మీ కోసం.
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్
అమెరికాకు చెందిన వోక్స్ వెబ్సైట్ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎక్కువ సంపాదిస్తున్న వారి జాబితాలో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్స్ కూడా ఉన్నారు. వీరు పెట్టే పోస్టుల ద్వారా ఏడాదికి రూ.30వేల డాలర్ల( రూ.22లక్షల) నుంచి లక్ష డాలర్లు(రూ.74లక్షలు) వరకు సంపాదిస్తున్నారు.
ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్స్ వస్త్ర, అందం, ఆహార, హోటల్స్ తదితర రంగాల్లో వ్యాపార ప్రకటనలను తమ పోస్టుల ద్వారా ప్రమోట్ చేస్తుంటారు. మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వారు అయితే ఒక్క పోస్టుకు 2.5లక్షల డాలర్లు(రూ.1.8కోట్లు) సంపాదిస్తున్నట్లు 'వోక్స్' చెబుతోంది. వీరు ప్రకటనల కోసం ఎక్కడికి పోనవసరం లేదు. హాయిగా ఇంట్లో నుంచే ప్రకటనలను ప్రమోట్ చేసి భారీగా సంపాదిస్తున్నారు.
ప్రొఫెషనల్ బెడ్ వార్మర్
'ప్రొఫెషనల్ బెడ్ వార్మర్' ట్రెండ్ 2017లో ప్రారంభమైంది. ప్రధానంగా స్టార్ హోటళ్లలో బెడ్ వార్మర్ ప్రొఫెషనల్స్ కనిపిస్తుంటారు. వినియోగదారుల సౌకర్యార్థం హోటళ్ల యాజమాన్యాలు వారిని నియమించుకుంటాయి.
కొంతమందికి నిద్రపోయే ముందు బెడ్ చల్లగా ఉంటే నిద్రపట్టదు. అయితే ఆ బెడ్‌ను వెచ్చగా ఉంచేందుకు 'ప్రొఫెషనల్ వార్మర్' దానిపై 10 నుంచి 20 నిమిషాలు పడుకుంటారు. పరుపు వెచ్చగా అయ్యాక ప్రొఫెషనల్ వార్మర్స్ వెళ్లిపోతారు. వినియోగదారుడు వచ్చి నిద్రపోతాడు.
ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రొఫెషనల్ బెడ్ వార్మర్గా విక్టోరియా ఇవాచ్యోవా గుర్తింపు పొందారు. 2017లో ఆమె ఈ వృత్తిలోకి ప్రవేశించారు. ఈ పనికి గానూ ఆమెకు ఒక రాత్రికి 65 పౌండ్లను చెల్లిస్తారు. ఈ ట్రెండ్ ఎక్కువగా యూకేలాంటి పాశ్చాత్య దేశాల్లోని స్టార్ హోటల్స్‌లో కనిపిస్తుంది.
ఐస్‌క్రీమ్ టేస్టర్
ఐస్‌క్రీమ్ ఇండస్ట్రీలో రుచిని బట్టి గిరాకీ ఉంటుంది. అందుకే ప్రపంచ మార్కెట్లో 'ఐస్‌క్రీమ్ టేస్టర్'కు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. బడా బడా కంపెనీలు భారీ మొత్తాల్లో వేతనాలు చెల్లించి వారిని నియమించుకుంటాయి.