ఉద్యోగంలో చేరి 5 నుంచి 20 సంవత్సరాలు పూర్తి అయినవారి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాలో చెప్పుకోదగ్గ మొత్తం జమవుతుంది. అయితే చాలా మందికి దీనిని ఉపసంహరించుకోవచ్చనే విషయం తెలియదు. రిటైర్‌మెంట్ సమయంలో మాత్రమే దీనిని తీసుకునే అవకాశం ఉందన్న భావనతో ఉంటారు. ఉద్యోగం మారినప్పుడు ఉపసంహరించుకోవచ్చు, నగదును బదిలీ చేసుకోవచ్చు అని అనుకుంటారు.
1.పిల్లలు, సోదరుల పెళ్లి కోసం లేదా సొంతంగా తమ పెళ్లి కోసం
మీరు ఉద్యోగంలో చేరి ఏడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పెళ్లి కోసం ఈపీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు. సర్వీసులో ఉన్నంతకాలం 3 సార్లు ఈ కారణంతో ఈపీఎఫ్ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే గరిష్ఠంగా ఖాతాలోని మొత్తంలో 50 శాతం కంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకునేందుకు వీలుండదు.
సంస్థ ఈపీఎఫ్ ఖాతాలో జమచేసిన వాటాను ఉపసంహరించుకునేందుకు వీలుండదు. అంటే మీ ఈపీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నప్పటికీ మొత్తం విత్‌డ్రా చేసుకునేందుకు వీలుండదు. అందులో మీరు జమ చేసింది ఎంత అన్నదే లెక్కలోకి తీసుకుంటారు. ఖాతాలో ఉద్యోగి జమచేసిన మొత్తం, దానిపై వడ్డీ మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది.
ఇది స్వయంగా తమ పెళ్లి కోసం, పిల్లల పెళ్లి కోసం, సోదరి లేదా సోదరుడి పెళ్లి కోసం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఒక సంస్థలో పదేళ్లుగా పనిచేస్తున్నారు. మీ సోదరి పెళ్లి కోసం ఈపీఎఫ్ నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు వివాహ వేదిక చిరునామా, ఫారం 31 లో పెళ్లి తేది, పెళ్లికి సంబంధించిన కొన్ని ఆధారాలను అంటే వివాహ ఆహ్వానం వంటివి వెరిఫికేషన్ కోసం మీ సంస్థకు ఇవ్వాలి.
2.మీ ఉన్నత విద్య కోసం లేదా పిల్లల చదువులకు
స్వయంగా మీ చదువుల కోసం లేదా పిల్లల చదువుల కోసం ఈపీఎఫ్ నగదును తీసుకోవచ్చు. మెట్రిక్యులేషన్ తర్వాత చదువులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే పదో తరగతి పూర్తయిన తర్వాత పై చదువుల కోసం ఉపయోగించుకోవచ్చు. మీ పిల్లల్ని ఏదేని కాలేజ్ లేదా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఇతర ప్రొఫెషనల్ కోర్సులో చేరుస్తున్నప్పుడు ఈపీఎఫ్ తీసుకోవచ్చు. అయితే ఉద్యోగంలో చేరి ఏడు సంవత్సరాలు పూర్తయిన తర్వాతే ఇది లభిస్తుంది. గరిష్ఠం మొత్తంలో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. జీవిత కాలంలో మూడు సార్లు ఈ కారణంతో ఈపీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవచ్చు. పెళ్లి, ఉన్నత చదువుల విషయంలో మూడు సార్లు ఈపీఎఫ్ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.
3.ఇళ్లు, స్థలం కొనుగోలు లేదా నిర్మాణం
నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేసేందుకు లేదా స్థలాన్ని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఈపీఎఫ్ నుంచి పరిమిత మొత్తంతో నగదు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఒకేసారి మాత్రమే లభిస్తుంది.
దీనికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలను పరిశీలిస్తే..
- ఇళ్లు లేదా స్థలం మీ పేరు లేదా మీ భార్య భర్త పేరుతో ఉండాలి. ఇద్దరి పేరుతో ఉమ్మడిగా కూడా ఉండవచ్చు (ఇంకా ఇతర కుటుంబ సభ్యుల పేరుతో కలిపి ఉండకూడదు)
- అయిదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.
- స్థలం కొనుగోలు చేసేందుకు మీ నెలవారి జీతానికి 24 రెట్ల వరకు గరిష్ఠంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
- ఇళ్లు, ఫ్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం చేసేందుకు అయితే వేతనానికి 36 రెట్ల మొత్తానికి సమానంగా తీసుకోవచ్చు ( స్థలం కొనుగోలుతో కలిపి).
ఉదాహరణకు, మీకు నెలకు రూ.80 వేల వేతనం, ఒక ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు. బేసిక్ వేతనం + డీఏ కలిపి నెలకు రూ.25 వేలు మాత్రమే. అప్పుడు మీ వేతనాన్ని రూ.25 వేలుగానే లెక్కిస్తారు. నిబంధనల ప్రకారం, రూ.25,000 * 36 = రూ.9 లక్షలు మీ ఈపీఎఫ్ ఖాతానుంచి తీసుకోవచ్చు. ఒకవేళ అంత డబ్బు ఖాతాలో లేకపోతే అంతకంటే తక్కువగా వస్తుంది. ఇళ్లు కొనుగోలు చేయడం అంత సులభమైన విషయం ఏం కాదు. చాలా ఖర్చులు ఉంటాయి. అలాంటి సమయంలో లభించే ఈ మొత్తం కూడా తోడ్పడుతుంది.
4.గృహ రుణ చెల్లింపు కొరకు
మీకు ఇదివరకే గృహ రుణం ఉంటే ఈపీఎఫ్ నుంచి కొంత భాగాన్ని ముందస్తు రుణ చెల్లింపుల కోసం తీసుకోవచ్చు. అయితే దీనికోసం పదేళ్ల సర్వీస్ ఉండాలి. ఒకేసారి మాత్రమే ఈ కారణంతో ఈపీఎఫ్ విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. అయితే ఇళ్లుకొనుగోలుకు లేదా గృహ రుణం చెల్లించేందుకు ఏదైనా ఒక కారణంతో నే తీసుకోవాలి. రెండింటికి కలిపి తీసుకునేందుకు అవకాశం ఉండదు. కేవలం మీ భార్య లేదా భర్త పేరుతో , ఇద్దరికీ కలిపి ఉమ్మడి రుణం ఉంటే ఇది వర్తిస్తుంది. ఇతర కుటుంబ సభ్యులతో ఉంటే లభించదు. మీ నెల వేతనానికి 36 రెట్ల చొప్పున ఈపీఎఫ్ నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు.
అయితే ఇక్కడ ఈపీఎఫ్ ఖాతాలో ఉద్యోగి, సంస్థ జమచేసిన దాని నుంచి కూడా తీసుకోవచ్చు. దీనికోసం ఇంటి అగ్రిమెంట్‌కు సంబంధించిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. దీంతోపాటు గృహ రుణం తీసుకున్నట్లుగా డాక్యుమెంట్లు వంటివి సమర్పించాలి. ఈపీఎఫ్ డబ్బు కూడా స్వయంగా మీ బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ఉద్యోగి చేతికి అందించరు.
5.ఇంటి రిపేర్ లేదా ఆధునీకరించేందుకు
ఇళ్లు నిర్మించి చాలా సంవత్సరాలు అయితే పాతదైపోతుంది. దాంతో ఇంటికి కొన్ని మార్పులు చేర్పులు చేయాల్పి ఉంటుంది. దీనికి కూడా చాలా ఖర్చవుతాయి. కొత్తగా నిర్మాణం చేపట్టాల్సి వస్తే, టైల్ మార్చడం, మరొక గదిని కట్టడం వంటి వాటికి భారీగానే వెచ్చించాల్సి ఉంటుంది.
- నెలవారి వేతననానికి 12 రెట్ల సమానమైన మొత్తాన్ని తీసుకోవచ్చు.
- ఇంటిని నిర్మించి కనీసం ఐదేళ్లు పూర్తై ఉండాలి.
- పదేళ్ల సర్వీస్ పూర్తి కావాలి
- ఒకసారి మాత్రమే ఈ కారణంతో ఈపీఎఫ్ విత్‌డ్రా చేసుకునే వీలుంది.
- ఇళ్లు భార్య, భర్త పేరుతో అయినా గానీ ఉమ్మడిగా గానీ ఉండాలి
- అయితే ఇది కేవలం మీరు జమచేసిన వాటా నుంచి మాత్రమే లభిస్తుంది. సంస్థ వాటానుంచి తీసుకునే వీలుండదు.
6.వైద్య చికిత్సలు
అందరికీ ఆరోగ్య బీమా పాలసీ ఉండటం చాలా అవసరం. అయితే పాలసీ లేకపోతే అత్యవసరంగా వైద్య చికిత్స చేసుకోవాల్సి వస్తే, సర్జరీ వంటివి అవసరం అయితే ఈపీఎఫ్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంది. మీకు లేదా కుటుంబ సభ్యులకు వైద్య చికిత్సల నిమిత్తం ఈపీఎఫ్ నుంచి మూడు సందర్భాల్లో నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
- నెల రోజుల కంటే ఎక్కువ కాలం హాస్పిటల్‌లో ఉంటే
- మేజర్ సర్జరీ చేయాల్సి వస్తే
- టీబీ, పక్షవాతం, క్యాన్సర్, మానసిక రోగం లేదా హృద్రోగ వ్యాదుల చికిత్స కోసం డబ్బు విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. దీనికి కచ్చితంగా ఇన్ని సంవత్సరాలు సర్వీస్ ఉండాలన్న నిబంధన లేదు. అయితే గరిష్ఠంగా 6 నెలల వేతనానికి సమానమైన డబ్బు మాత్రమే తీసుకోవచ్చు. వైద్య చికిత్సల నిమిత్తం ఎన్ని సార్లయినా ఈపీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు. దీంతో అత్యవసర సమయంలో ఈపీఎఫ్ మీకు సాయపడుతుందనడంలో సందేహం లేదు.
- అయితే ఈపీఎఫ్ విత్‌డ్రా చేసుకునేందుకు ఫారం 31 తో పాటు, అవసరమైన డాక్యుమెంట్లు,
- ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ సదుపాయం ఆ ఉద్యోగికి లేనట్లుగా ఉన్న సర్టిఫికెట్ సంస్థ లేదా స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి పొందిన సర్టిఫికెట్ అందించాలి.
- టీబీ, పక్షవాతం, క్యాన్సర్, కుష్టు లేదా మానసిక వ్యాది వంటి నిర్ధేశిత వ్యాదుల చికిత్స కోసం నెల రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్ నుంచి పొందిన సర్టిఫికెట్‌ను సమర్పించాలి.
చివరగా...
ఈపీఎఫ్ ఖాతా ఉద్యోగులకు దీర్ఘకాలంగా నగదును జమ చేసుకునే అవకాశం ఉన్న ఒక మంచి సదుపాయం. అవసరం లేకుండా ఖాతా నుంచి డబ్బు తీసుకోకూడదు. అవసరం ఉన్నప్పటికీ వేరే చోట డబ్బు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఖాతాను కదిలించకపోవడమే మంచిది. ప్రతినెల ఉద్యోగి ప్రమేయం లేకుండానే ఖాతాలో నగదు జమవుతుంది. అయితే కచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో డబ్బు అవసరం అనుకుంటే వేరే మార్గం లేనప్పుడు ఈపీఎఫ్ నుంచి తీసుకోవచ్చు.