ఐదోతరం (5జీ) వైర్లెస్ కమ్యూనికేషన్ సేవల చలవతో 21వ శతాబ్ది జన జీవితం సమూలంగా మారిపోనున్నది. స్మార్ట్ నగరాల నుంచి హైటెక్ పరిశ్రమల వరకు, సామాజిక సంబంధాలు మొదలుకొని దేశ భద్రత వరకు అన్ని రంగాలు 5జి వల్ల రూపాంతరం చెందనున్నాయి. చైనీస్ కంపెనీ హువావై ఈ సాంకేతిక విప్లవానికి ప్రధాన సారథిగా నిలుస్తోంది. 5జి సాంకేతికతను, దానికి కావలసిన కమ్యూనికేషన్ పరికరాలను కారు చౌకగా అందించడంలో హువావైకి దీటైన కంపెనీ మరొకటి లేదు. కానీ, ఈ చౌక సేవలకు పరోక్షంగా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందన్న భయాలున్నాయి. హువావై... ఆ మాటకొస్తే ఏ చైనా కంపెనీ అయినా విదేశాల్లో వ్యాపారం చేసేటప్పుడు అక్కడి సమాచారాన్ని సేకరించి చైనా ప్రభుత్వానికి అందించాలని ఆ దేశ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఇది తమ దేశ భద్రతకు ప్రమాదకరమని అమెరికా ప్రభుత్వం గుర్రుగా ఉంది. అందుకే అమెరికాలో హువావైకి ప్రభుత్వ సేవల కాంట్రాక్టులు ఇవ్వరాదంటూ నిషేధం విధించారు. ఆస్ట్రేలియా, జపాన్ కూడా హువావైని కట్టడి చేశాయి. త్వరలో కెనడా, న్యూజీలాండ్ కూడా అదే పని చేయనున్నాయి.
అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ సమస్యతో పాటు, ఇతర అంశాల్లో భారతదేశంతో విభేదిస్తూ, పాకిస్థాన్ కొమ్ముకాస్తున్న చైనాతో 5జి రంగంలో పొత్తు పెట్టుకోవడం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు. హువావై టెలికాం పరికరాల్లో గూఢచర్యానికి ఉపకరించే ‘బ్యాక్ డోర్స్’ ఉన్నాయని అమెరికా హెచ్చరిస్తోంది. ఐరోపా దేశాల్లో హువావై నిర్మించిన విస్తృత టెలికమ్యూనికేషన్ యంత్రాంగాల నిండా చైనా నిఘానేత్రాలున్నాయని తెలిపింది. ఇటలీలో తన వ్యవస్థ విస్తరణకోసం హువావై సరఫరా చేసిన పరికరాల్లో బ్యాక్ డోర్స్‌ను కనిపెట్టినట్లు వోడాఫోన్ సంస్థ వెల్లడించడం అమెరికా హెచ్చరికను రూఢి చేసింది. అయినా జర్మనీ, స్విట్జర్లాండ్, స్పెయిన్ తదితర ఐరోపా దేశాలు హువావై 5జి పరికరాలను వినియోగిస్తూనే ఉన్నాయి. 2019 డిసెంబరునాటికి ప్రపంచవ్యాప్తంగా 5జి టెలికాం యంత్రాంగాల నిర్మాణానికి హువావై మొత్తం 65 కాంట్రాక్టులు పొందగా, వాటిలో సగం ఐరోపా దేశాల్లోనే లభించాయి. హువావై 5జి పరికరాల్లో బ్యాక్ డోర్స్ లేవని తనిఖీలో తేల్చామని, వాటిని ఉపయోగించడానికి అనుమతించాలని బ్రిటిష్ టెలికాం, వోడాఫోన్ కంపెనీలు ప్రధాని బోరిస్ జాన్సన్‌కు విన్నవించదలిచాయి.
భారత్ మాత్రం ప్రయోగాత్మక 5జి సేవలకు హువావైని అనుమతిస్తామని గత ఏడాది డిసెంబరు 30న ప్రకటించింది. అమెరికాకు చెందిన సిస్కో, స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్, ఫిన్లాండ్కు చెందిన నోకియా, దక్షిణ కొరియాకు చెందిన సామ్సంగ్తోపాటు దేశవిదేశీ సంస్థలు ఇందుకు పోటీపడవచ్చని ప్రకటించింది. దిల్లీలో 5జి ప్రయోగాలకు వోడాఫోన్-ఐడియాతో, బెంగుళూరులో భారతీ ఎయిర్‌టెల్‌తో హువావై జట్టుకట్టింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో 5జి ప్రయోగాలను నిర్వహించి 2021లో పూర్తిస్థాయి 5జి వ్యవస్థలను ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
పదేళ్లలో అయిదు శాతం వాటా
జపాన్ ఈ ఏడాది టోక్యోలో జరిగే వేసవి ఒలింపిక్స్‌లో 5జి సాంకేతికతను ప్రదర్శించనున్నది. నిజానికి జపాన్ ఈ సాంకేతికతతో తయారుచేసిన ప్రత్యేక కళ్లద్దాలను గత ఏడాది డిసెంబరు 14-17 మధ్య గువాహటిలో ప్రదర్శించాలనుకుంది. ఆ తేదీల్లో అక్కడ జరగాల్సిన శిఖరాగ్ర సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే 5జి కళ్లద్దాలను ఉపయోగించి బ్రహ్మపుత్ర నదిని వీక్షించాలనుకున్నారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) అప్లికేషన్స్ సాయంతో నదీ వీక్షణానికి తోడ్పడే కళ్లద్దాలవి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోమ్‌లో ఆందోళన పెచ్చరిల్లడంతో టోక్యో విజ్ఞప్తిపై మోదీ-అబే సమావేశం వాయిదాపడింది. 2025కల్లా ప్రపంచంలోని 5జి మొబైల్ చందాదారుల్లో సగానికి పైగా జపాన్, అమెరికా, చైనా, దక్షిణ కొరియాల్లోనే ఉంటారు. ఈ రంగంలో స్వీడన్, ఫిన్లాండ్ తదితర స్కాండినేవియా దేశాలూ అగ్రగాములుగా ఉన్నాయి. వచ్చే పదేళ్లలో ప్రపంచ 5జి మార్కెట్లో అయిదు శాతం వాటాను (రూ.7 లక్షల కోట్లను) కైవసం చేసుకోవాలని లక్షిస్తోంది కాబట్టి, భారత్ పలు దేశాల టెలికాం సంస్థలను 5జి ప్రయోగాలకు బిడ్ చేయవలసిందిగా ఆహ్వానిస్తోంది. తన పరికరాల్లో నిఘా కళ్లు ఉన్నాయనే ఆందోళనను హువావై సంస్థ కొట్టివేస్తోంది. ఇతర దేశాల సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి అందించేది లేదని భరోసా ఇచ్చింది. అందుకే అనేక ఐరోపా దేశాలతోపాటు భారతదేశమూ ఆ సంస్థను అనుమతిస్తోంది. చిప్ సెట్స్ మొదలుకొని 5జి ఫోన్లు, టెలికాం పరికరాలను హువావై చాలా చౌక ధరలకు అందిస్తోంది. అదీకాక ఇప్పటికే భారత్ వినియోగిస్తున్న టెలికాం పరికరాల్లో 90 శాతం హువావై, నోకియా, ఎరిక్సన్ వంటి విదేశీ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్నవే కాబట్టి, సమాచార చౌర్య ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల భారత్ విదేశీ టెలికాం పరికరాలను నిరంతరం శల్యపరీక్ష చేస్తూనే ఉండకతప్పదు. మనకున్న సువిశాల మొబైల్ మార్కెట్లో ప్రవేశం కల్పించినందుకు ఇతర దేశాల నుంచి భారీ ప్రతిఫలం పొందాలి. మన వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవాలి.