5G Auction In India: దేశంలో 5జీ సేవలకు శ్రీకారం చుట్టేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాదే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కేంద్రం ఇది వరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. మే నెలలో ఈ ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉందని టెలికాం విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
వేలం ప్రక్రియకు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (ట్రాయ్) మార్చి చివరి నాటికి సిఫార్సులను పంపించనుందని టెలికాం కార్యదర్శి కె రాజారమణ్ తెలిపారు. అక్కడికి ఓ నెల రోజులు మిగిలిన ప్రక్రియకు సమయం పడుతుందని చెప్పారు. అదే సమయంలో వేలం ప్రక్రియకు సంబంధించి ఇతర ప్రక్రియలను టెలికాం విభాగం (డీఓటీ) వేగవంతం చేయనుందని వివరించారు.
గతంలో ట్రాయ్ సిఫార్సులు పంపించిన 60-120 రోజులకు వేలం ప్రక్రియ జరిగేది. ఈ సారి ట్రాయ్ నుంచి సిఫార్సులు అందుకున్న రెండు నెలల్లోనే వేలం ప్రక్రియను టెలికాం విభాగం పూర్తిచేయనున్నట్లు రాజా రమణ్ వెల్లడించారు.