'ఇంటర్నెట్ అంటే గూగులేనా..? లోగుట్టు ఏంటి?' ఆన్లైన్ ప్రకటనల మార్కెట్లో గూగుల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా అమెరికాలోని 50 రాష్ట్రాలు ఏకమయ్యాయి. గూగుల్ 'గుత్తాధిపత్య ప్రవర్తన'కు వ్యతిరేకంగా సోమవారం నుంచి దర్యాప్తు చేపడుతున్నట్లు ప్రకటించాయి.
"వివిధ రాష్ట్రాలకు చెందిన యాభై మంది అటార్నీ జనరల్స్.. గూగుల్ 'గుత్తాధిపత్య ధోరణి'పై దర్యాప్తు చేపడతారు."
- కార్ల్ రేసిన్, కొలంబియా డిస్ట్రిక్ట్ అటార్నీ జనరల్
చాలా మంది ఇంటర్నెట్ ఉచితం అని భావిస్తున్నప్పటికీ అది నిజం కాదని, గూగుల్ ఆర్జిస్తున్న 117 బిలియన్ డాలర్ల ఆదాయం దీనిని నిరూపిస్తుందని అటార్నీ జనరల్స్ బృందం పేర్కొంది.
"ఆన్లైన్ ప్రకటనలు, సెర్చ్ వంటి అంశాల్లో గూగుల్ ఆధిపత్యం చెలాయిస్తోంది. కొనుగోలుదారులపైనా, అమ్మకందార్లపైనా, చివరకు వేలంలోనూ గుత్తాధిపత్యం వహిస్తోంది. యూట్యూబ్ ద్వారా వీడియోలపైనా ఆధిపత్యం సాగిస్తోంది."
- కెన్ పాక్స్టన్, టెక్సాస్ అటార్నీ జనరల్
"ఇంటర్నెట్లో పోటీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. నూతన ఆవిష్కరణలను కాపాడుకునే దిశగా కృషి చేస్తున్నాం."
- కర్టిస్ హిల్, ఇండియానా అటార్నీ జనరల్
ఆధిపత్యమా...నోనో
'ఆధిపత్యం' ఆరోపణలను గూగుల్ తోసిపుచ్చింది. తమ సంస్థ ప్రజలకు సేవచేస్తోందని, వినియోగదారులు తమకు కావాల్సింది ఎంపిక చేసుకోవడానికి మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేసింది. అమెరికాలో వేలాది ఉద్యోగాలు కల్పించామని, చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేసింది.
ఫేస్బుక్పైనా..
సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్పైనా కొన్ని రాష్ట్రాల సమాఖ్య దర్యాప్తునకు సన్నద్ధమవుతోంది. "ఫేస్బుక్... వినియోగదారుల డేటా దుర్వినియోగానికి పాల్పడిందా? లేదా? ఇతరుల నుంచి వస్తున్న పోటీని అడ్డుకునేందుకు అడ్డదారులు తొక్కిందా?" అనే విషయాలపై విచారణ జరగనుంది.
ఇదీ చూడండి: 'అలీబాబా' ఛైర్మన్ పదవికి జాక్ మా వీడ్కోలు