కనీస పింఛను మొత్తాన్ని వెంటనే రూ.3 వేలకు పెంచాలని బోర్డులోని కార్మిక సంఘాలు కోరుతుండగా, అంత భారం భరించలేమని ఈపీఎఫ్‌ఓ చెబుతోంది. ఈ నేపథ్యంలో విశ్రాంత కార్మికులు, వితంతు పింఛనుదారులకు కనీసం రూ.2 వేలకు పెంచాలని ఉన్నతస్థాయి కమిటీ తెలిపింది. అవసరమైతే కేంద్రం నుంచి ఆర్థిక సహకారం తీసుకోవాలని సూచించింది.
గత రెండు ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశాల్లో కనీస పింఛను పెంపు అంశం చర్చకు వచ్చినప్పుడు.. ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈపీఎఫ్‌ఓ బోర్డు ఛైర్మన్, కేంద్ర కార్మికశాఖ మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికీ నిర్ణయం జరగలేదు. మార్చి 5న జరిగే సమావేశంలోనైనా దీనిపై నిర్ణయం తీసుకుంటారని దాదాపు 44 లక్షల మంది పింఛనుదారులు ఎదురుచూస్తున్నారు.