తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెరికా కాంగ్రెస్ ముందు టెక్ దిగ్గజాల వాంగ్మూలం - Tim Cook of Apple

మార్కెట్​లో పోటీని అరికడుతున్నాయనే ఆరోపణలపై దిగ్గజ సాంకేతిక సంస్థలైన ఫేస్​బుక్, యాపిల్, అమెజాన్, గూగుల్ సంస్థలు అమెరికా కాంగ్రెస్ ముందు వివరణ ఇచ్చాయి. కాంగ్రెస్​లో జరుగుతున్న విచారణకు హాజరైన సంస్థ సీఈఓలు... చట్టసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

4 Big Tech CEOs take congressional heat on competition
అమెరికా కాంగ్రెస్ ముందు సాంకేతిక సంస్థల వాంగ్మూలం

By

Published : Jul 30, 2020, 1:03 PM IST

మార్కెట్​లో పోటీని అరికడుతున్నారనే ఆరోపణలపై అమెరికాలోని నాలుగు దిగ్గజ సంస్థలైన ఫేస్​బుక్, యాపిల్, అమెజాన్, గూగుల్ సీఈఓలు అమెరికా కాంగ్రెస్ ముందు వివరణ ఇచ్చారు. తమ సంస్థలు పాటిస్తున్న విధానాలు గురించి మార్క్​ జూకర్​బర్గ్, టిమ్ కుక్, జెఫ్ బెజోస్, సుందర్ పిచాయ్​లు హౌస్ ప్యానెల్​కు నివేదించారు.

బుధవారం సైతం సీఈఓలకు, చట్ట సభ్యులకు మధ్య విస్తృతమైన వాదనలు జరిగాయి. సంస్థల విధివిధానాలు సమర్థించుకునేందుకు సీఈఓలు ప్రయత్నించారు. మార్కెట్​లో పోటీతత్వం ఏ విధంగా ఉందనే విషయాన్ని గణాంకాలతో వివరించారు. వినియోగదారులకు తమ సంస్థ సేవల అవసరాన్ని విశదీకరించారు. అయితే వ్యాపార పద్ధతుల గురించి చట్టసభ్యులు నేరుగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కష్టపడ్డారు.

రాజకీయ పక్షపాతం, అమెరికా ప్రజాస్వామ్యంపై దాని ప్రభావం, చైనా పాత్ర వంటి ఆరోపణలను సంస్థలు ఎదుర్కొంటున్నాయి. దూరదృశ్య మాధ్యమాల ద్వారా సీఈఓలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

గూగుల్, అమెజాన్​పై ప్రధానంగా...

తమకు ప్రయోజనం కలిగేలా పోటీదారుల నుంచి సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తున్నారనే ఆరోపణలపై గూగుల్, అమెజాన్ సీఈఓలకు కఠిన ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ సభ్యులు.

అమెజాన్ సంస్థ తన అమ్మకందారుల నుంచి డేటాను సేకరించి సొంత ఉత్పత్తులను తయారు చేస్తోందా అనే కోణంలో అమెరికా, ఐరోపా నియంత్రణ సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఈ విషయంపై జెఫ్ బెజోస్​ను ప్రశ్నించగా.. సంస్థ పాలసీలను ఉల్లంఘించలేదని తాను హామీ ఇవ్వలేనని తన వాంగ్మూలంలో తెలిపారు.

"మా ప్రైవేటు వ్యాపారాలకు ప్రయోజనకరంగా విక్రేతల డేటాను ఉపయోగించకూడదని మాకు ఓ విధానం ఉంది. ఈ విధానం ఉల్లంఘనకు గురి కాలేదని మాత్రం నేను హామీ ఇవ్వలేను."

-జెఫ్ బెజోస్, అమెజాన్ సీఈఓ

ఇతర వెబ్​సైట్ల నుంచి ఐడియాలు, సమాచారాన్ని దొంగలించి తన సొంత డిజిటల్ సేవలకు ప్రజలను ఆకర్షించేందుకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఫలితాలను తారుమారు చేస్తోందన్న ఆరోపణలపై రిపబ్లికన్ సభ్యుడు డేవిడ్ సిసిలినీ గూగుల్ సీఈఓను ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలను పిచాయ్ తోసిపుచ్చారు. సెర్చ్​ ఇంజిన్​ను ఉపయోగిస్తున్న కోట్లాది మందికి గూగుల్ సంబంధిత సమాచారం అందించేందుకే ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చారు.

డెమొక్రాట్ సభ్యులు ప్రధానంగా మార్కెట్ పోటీపైనే దృష్టిసారించగా.. పలువురు రిపబ్లికన్లు చైనాలో వ్యాపార కార్యకలాపాల వివాదాలను ప్రస్తావించారు.

ట్రంప్ వార్నింగ్!

వాదనలు ప్రారంభమయ్యే ముందు ఈ కంపెనీలను అణచివేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ సంస్థలన్నీ తనతో పాటు సంప్రదాయవాదులందరికీ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయంటూ ఇదివరకే ఆరోపణలు చేశారు.

"దిగ్గజ సాంకేతిక సంస్థల్లో చట్టబద్ధత తీసుకురావడంలో కాంగ్రెస్ విఫలమైతే, ఆ పని నేనే కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా చేస్తా. ఈ పని కాంగ్రెస్ ఏనాడో చేయాల్సింది."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అయితే కాంగ్రెస్ ఆమోదించిన చట్టాలతో పోలిస్తే అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వుల పరిధి పరిమితంగానే ఉంటుంది. సమాఖ్యా చట్టాలను మార్చేందుకు ఈ ఉత్తర్వులను అధ్యక్షుడు ఉపయోగించలేరు.

కాంగ్రెస్​తో పాటు, ట్రంప్ ప్రభుత్వం, ఫెడరల్ రెగ్యులేటర్లు, ఐరోపా నియంత్రణ సంస్థల నుంచి ఈ నాలుగు కంపెనీలు న్యాయపరమైన, రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ సంస్థల వ్యాపార విధానాలపై న్యాయ శాఖతో పాటు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణ జరుపుతోంది.

ఇదీ చదవండి:భారత్- నేపాల్ మధ్య మళ్లీ కాలాపానీ రగడ!

ABOUT THE AUTHOR

...view details