భారత్‌లో బంగారు ఆభరణాల రిటైల్ విక్రయాలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 37 శాతం మంది మహిళలు అసలు బంగారం కొనుగోలు చేయలేదని.. వారంతా భవిష్యత్‌లో కొనేందుకు మొగ్గుచూపుతారని తెలిపింది. 'రిటైల్ గోల్డ్ ఇన్సైట్స్: ఇండియన్ జువెలరీ' పేరుతో విడుదల చేసిన తాజా సర్వేలో ఈ విషయాలు వెల్లడించింది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్.
దేశంలో 60 శాతం మందికి ఇప్పటికే ఆభరణాలు ఉన్నట్లు ఈ సర్వే వివరించింది. మహిళల షాపింగ్‌లో బంగారు ఆభరణాలు రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. డిజైనర్ దుస్తులు, సిల్క్ చీరలు మొదటి స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.
పరిశ్రమ లక్ష్యం వారే..
బంగారు పరిశ్రమ కొత్త వినియోగదారులకు చేరువయ్యేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది వరకు పసిడి కొనుగోలు చేయని 37 శాతం మంది మహిళలే పరిశ్రమకు లక్ష్యంగా మారనున్నారని సర్వే అభిప్రాయపడింది. సర్వేలో పాల్గొన్న 44 శాతం మంది గ్రామీణ, 30 శాతం పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ఈ కేటగిరీలోకి వస్తారని వివరించింది కౌన్సిల్.
సర్వేలో పాల్గొన్న మరో 40 శాతం మంది మహిళలు గడిచిన 12 నెలల్లో డైమండ్, ప్లాటినం వంటి నగలు కొనుగోలు చేసినట్లు తెలిపింది కౌన్సిల్.
యువతులు కూడా బంగారు ఆభరణాల కొనుగోలులో క్రీయాశీలంగా ఉన్నారని పేర్కొంది సర్వే. గడిచిన 12 నెలల్లో 33 శాతం మంది 18-24 ఏళ్ల వయస్సున్న యువతులు పసిడి కొనుగోళ్లు జరిపినట్లు వెల్లడించింది. అయితే భావిష్యత్లో కొనుగోళ్లపై వీరిలో ఆసక్తి తక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ ధోరణి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు వివరించింది.
మార్పు అవసరం..
బంగారు నగల మార్కెట్లో భారత్ ప్రపంచంలోనే ప్రముఖ స్థానంలో ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (భారత్) ఎండీ సోమసుందరం తెలిపారు. అయితే నగల పరిశ్రమ కాలానికి తగ్గట్లుగా మారాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సర్వే కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు వివరించారు. మార్పులు లేకపోతే ఇతర బ్రాండ్లతో పోలిస్తే.. యువతకు నగలు దూరమయ్యే ప్రమాదముందని తెలిపారు. ఇందుకోసం యువత అభిరుచులకు తగ్గట్లు మార్పులు రావాలని సూచించారు.
ఇదీ చూడండి:వాట్సాప్ ద్వారా వంట గ్యాస్ బుకింగ్ సేవలు