చమురు ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 25 పైసల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు సంస్థలు. దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.85.70, డీజిల్ రూ.75.88 ఉండగా ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.92.28, డీజిల్ రూ.82.66కి చేరింది. దీంతో చమురు ధరలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి.
నియంత్రణ లేక చమురు ధరలు ఆకాశాన్ని అంటుతుండటం వల్ల వాహనదారులు ఆందోళ చెందుతున్నారు. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లను సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికే స్పష్టం చేశాయి.
సుంకం తగ్గిస్తారా?
దేశంలో ఇంధన ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపు యోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే చమురు మంత్రిత్వ శాఖ ఆర్థికశాఖకు లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు కేంద్రం దేశంలో ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అయితే ఇప్పుడు ఇంధన ధరలు మండిపోతుండటంతో వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు సుంకాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.
ఇదీ చదవండి :ఇంధన వాడకం తగ్గినా.. వసూళ్లు పెరిగాయ్!