ఏటా సార్వత్రిక బడ్జెట్‌కు ముందు ఎన్నో ఊహాగానాలు వినిపిస్తుంటాయి. ఆదాయ పన్ను పరమితి పెంపు వాటిలో ప్రధానమైంది. కేంద్రం 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఈ సారీ అదే రీతిలో చర్చ జరుగుతోంది. మరి ఈసారైనా ఈ ఊహాగానాలు నిజమవుతాయా? ఇటీవల వేర్వేరు వర్గాలకు పన్ను మినహాయింపులు ఇచ్చిన మోదీ సర్కార్... వేతన జీవులపై కనికరిస్తుందా?
పద్దు 2020: వేతన జీవులకు ఊరట లభించేనా? వారికి ఇచ్చారు... మరి వీరికి..?
క్షీణిస్తున్న ఆర్థిక ప్రగతిని గాడిలో పెట్టేందుకు, దేశంలో పెట్టుబుడులను పెంచేందుకు ప్రభుత్వం కార్పొరేట్ పన్నును గతేడాది 25 శాతానికి తగ్గించింది. ఈ 10 శాతం తగ్గింపు వల్ల రూ. 1.45 లక్షల కోట్ల పన్ను రాబడి తగ్గిపోతోందని ప్రభుత్వం అంచనా వేసింది.
విదేశీ సంస్థాగత పెట్టుబడులపై ప్రభుత్వం సర్ ఛార్జీని రద్దు చేసింది. దీనితో పాటు వ్యాపారులకు జీఎస్టీలో ప్రయోజనాలను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవే కాకండా పలు ఇతరత్రా ఊరటల వల్ల ప్రభుత్వానికి పన్ను ఆదాయం తగ్గిపోయింది.
కార్పొరేట్ వర్గాలకు ఈ స్థాయిలో లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం... తమకు కూడా బడ్జెట్ ద్వారా ఎంతో కొంత ఊరట కలిగిస్తుందన్న ఆశతో ఉన్నాయి నికర ఆదాయ వర్గాలు.
కొనుగోలు శక్తి పెరుగుతుంది కానీ..
ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం వల్ల దేశ పారిశ్రామిక, సేవా రంగాలు ఇబ్బందిపడుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే ఆదాయపు పన్ను లో మార్పులు చేపట్టాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీని ద్వారా ప్రజలు చేతిలో ఖర్చు పెట్టేందుకు కావాల్సిన డబ్బులు ఉండి.. వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే నిధులు కొరతతో సతమతమవుతోంది. ఆదాయపు పన్నులో మార్పుల వల్ల మరింతగా పన్ను రాబడి ప్రభుత్వానికి తగ్గిపోనుంది.
పన్ను తగ్గింపుతో ప్రయోజనమెంత?
దేశంలో ఆదాయపు పన్ను కట్టే వారి సంఖ్య 5 శాతంగానే ఉంది. ఆదాయపు పన్ను పరిమితిని పెంచటం, పన్నును తగ్గించటం లాంటి చర్యల వల్ల వీరికి మాత్రమే లబ్ధి జరగనుంది. ఇంత తక్కువ మందికి సంబంధించిన పన్నును తగ్గించడం... నిజంగా ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనగా పనిచేస్తుందా అన్నది అసలు ప్రశ్న.
పన్ను తగ్గింపునకు బదులుగా జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి వాటిపై ఖర్చు చేయటం ద్వారా ఎక్కువ స్థాయిలో ప్రజల ఆదాయం పెరుగుతుంది. దీనితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. ప్రభుత్వం మరింత ఆదాయం కొల్పోవటానికి సిద్ధంగా లేనందున... ఎలాంటి చర్యలు తీసుకున్నా స్వల్పంగానే ప్రభావం ఉంటుందన్నది నిపుణుల మాట.
ఇదీ చూడండి: శనివారం పనిచేయనున్న స్టాక్ మార్కెట్లు- కారణం ఇదే...