గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా 2019లో వాహన రంగం భారీగా క్షీణతను చవిచూసింది. వినియోగదారుల్లో బలహీన సెంటిమెంట్, గ్రామీణ ప్రాంతాల నుంచి తగ్గిన డిమాండ్, ఆర్థిక వృద్ధి మందగమనం వంటి పరిస్థితులు వాహన రంగానికి ప్రతికూలంగా మారినట్లు సొసైటీ ఆఫ్ ఆటోమోబైల్ మానుఫాక్చరర్స్ (సియామ్) తెలిపింది.
సియామ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. అన్ని కేటగిరీల్లో కలిపి గతేడాది 2,30,73,438 వాహనాలు అమ్ముడైనట్లు తెలిసింది. అయితే 2018లో 2,67,58,787 యూనిట్లు విక్రయమవడం గమనార్హం. 2018తో పోలిస్తే వాహన విక్రయాలు 2019లో 13.77 శాతం తగ్గినట్లు సియామ్ వెల్లడించింది.
నెల, ఏడాది ప్రాతిపాదికన వాహన విక్రయాల గణాంకాలను నమోదు చేయడం ప్రారంభించినప్పటి (1997) నుంచి ఈ స్థాయిలో అమ్మకాలు క్షీణించడం ఇదే ప్రథమం. గతంలో చూస్తే 2007లో వాహన విక్రయాలు అత్యధికంగా 1.44 శాతం క్షీణించాయని సియామ్ పేర్కొంది.
కేటగిరీల వారీగా క్షీణత ఇలా..
వినియోగదారుల వాహనాలు 2019లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 12.75 శాతం క్షీణించి 29,62,052 యూనిట్లు విక్రయమయ్యాయి. 2018లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 33,94,790 యూనిట్లుగా ఉన్నాయి.
ద్విచక్రవాహనాల అమ్మకాలు గతేడాది 1,85,68,280 యూనిట్లుగా ఉన్నాయి. 2018 మొత్తం మీద 2,16,40,033 ద్విచక్ర వాహనాలు విక్రయమయ్యాయి. ఈ లెక్కన 2018తో పోలిస్తే 2019లో ద్విచక్రవాహనాల విక్రయాలు 14.19 శాతం క్షీణించినట్లు తెలుస్తోంది.