పాన్ కార్డులను ఆధార్ కార్డుతో 2021 మార్చి 31లోగా అనుసంధానం చేసుకోవాలని ఐటీ శాఖ ఇప్పటికే పలుసార్లు గుర్తు చేసింది. అయితే ప్రస్తుతం ఆధార్‌తో లింక్ చేయని సుమారు 18 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయని ఇటీవల వెల్లడించింది. గడువు ముగిసేలోగా వాటిని ఆధార్‌తో జోడించకపోతే నిర్వీర్యం చేస్తామని ఆ శాఖ హెచ్చరించింది.
ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులను ఉపయోగించే వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తాల్లో లావాదేవీలు జరిపేవారిని గుర్తించే పనిలో ఉన్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. కొందరు విలాసవంతంగా ఖర్చులు చేస్తూ... పన్నులను ఎగవేసేందుకు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేస్తే, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొందే అవకాశం ఉండదని.. అందుకే లింక్ చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారని వివరించారు.
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్, క్రెడిట్-డెబిట్ కార్డులు వంటి వ్యవస్థల ద్వారా జరిగే భారీ లావాదేవీలను గుర్తించి.. ఆ వ్యయాల తీరుపై కూడా ఐటీ శాఖ నిఘా పెట్టనుంది. ఈ క్రమంలో స్టేట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (ఎస్‌ఎఫ్టీ) సహాయంతో సంబంధిత వ్యక్తులను గుర్తించనున్నారు.