భారత మొబైల్ వినియోగదారులకు నకిలీ కాల్స్ తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నాయట. 2019లో ప్రతి నెలా ఈ స్పామ్ కాల్స్ 15 శాతం పెరుగుతున్నట్లు ట్రూకాలర్ ఓ నివేదిక వెలువరించింది. అయితే... ఈ ఇబ్బందికరమైన కాల్స్ బాధిత దేశాల్లో గతేడాదితో పోలిస్తే భారత్ కాస్త మెరుగైన స్థానంలోనే నిలిచింది.
స్పామ్ కాల్స్‌తో అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో గతేడాది భారత్ రెండో స్థానంలో నిలిచింది. బ్రెజిల్ మాత్రమే భారత్ కంటే ముందుంది.
2019లోనూ బ్రెజిల్‌లోనే ఎక్కువగా స్పామ్ కాల్స్ నమోదవ్వగా... భారత్ ఈ సారి ఐదో స్థానంలో నిలిచింది. బ్రెజిల్లో సగటున వినియోగదారునికి నెలకు 45.6 స్పామ్ కాల్స్ వస్తున్నాయట.
''భారత మొబైల్ వినియోగదారుల్లో స్పాం కాల్స్ శాతం పెరుగుతూనే ఉంది. నెలకు ఒక వినియోగదారునికి 25.6 స్పాం కాల్స్ వస్తున్నాయి. ఇది గతేడాది కంటే 15 శాతం ఎక్కువ.''
- ట్రూ కాలర్ నివేదిక
పెరూ(30.9 శాతం), ఇండోనేసియా(27.9), మెక్సికో(25.7) వరుసగా 2,3,4 స్థానాల్లో నిలిచాయి. స్పాం కాల్స్‌తో ఎక్కువగా ప్రభావితమైన టాప్-10 దేశాలలో సౌతాఫ్రికా, చిలీ, అమెరికా, రష్యా, కొలంబియా కూడా ఉన్నాయి.