కరోనా మహమ్మారి.. సింగరేణిని కష్టాల్లోకి నెట్టింది. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత నష్టాన్ని ఈ సంస్థ మూటగట్టుకుంది. గత రెండు నెలల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణా పడిపోవడంతో రూ.1477.08 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లింది. ఏప్రిల్, మే నెలల్లో 1.19 కోట్ల టన్నుల లక్ష్యానికి గానూ 62 లక్షల టన్నులే తవ్వింది. ఉత్పత్తి 44 శాతం తగ్గింది. లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ 1 నుంచి భూగర్భ గనుల్లో తవ్వకం నిలిపివేయడం సంస్థపై తీవ్ర ప్రభావం చూపింది. గత నెల 21 నుంచి వీటిలో తిరిగి తవ్వకాలు ప్రారంభించినా ఉత్పత్తి పెద్దగా పెరగలేదు.
విద్యుత్ డిమాండ్ తగ్గడంతో..
సింగరేణి గనుల్లో తవ్వే బొగ్గును అత్యధికంగా విద్యుత్ కేంద్రాలకు, ఇతర పరిశ్రమలకు విక్రయిస్తుంది. దేశంలో లాక్‌డౌన్ అమలులోకి వచ్చాక విద్యుత్ డిమాండు పడిపోయింది. జనతా కర్ఫ్యూకు ముందు దేశవ్యాప్తంగా ఒకరోజు విద్యుత్ గరిష్ఠ డిమాండు లక్షా 70 వేల మెగావాట్లుండగా లాక్‌డౌన్ సమయంలో అది లక్షా 16 వేల మెగావాట్లకు తగ్గింది. తెలంగాణలో గత ఫిబ్రవరి 28న అత్యధికంగా 13,168 మెగావాట్ల డిమాండు ఉండగా, లాక్‌డౌన్ సమయంలో ఒక దశలో 4500 మెగావాట్లకు పడిపోయింది.