రాయల్ ఎన్ఫీల్డ్(Royal Enfield).. మోటార్‌సైకిళ్ల తయారీ రంగంలో ఓ ప్రత్యేక ఒరవడిని సృష్టించిన బ్రాండ్. బుల్లెట్(bullet), క్లాసిక్(classic), ఇంటర్‌సెప్టర్(Royal Enfield Interceptor), కాంటినెంటల్ జీటీ(Continental GT), మీటియర్, హిమాలయన్ వంటి మోడళ్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని.. దశాబ్దాలుగా వినియోగదారుల ఆదరణ పొందుతున్నాయి. విక్రయాల్లో వరల్డ్‌క్లాస్ బైక్ మోడల్స్ హార్లే-డేవిడ్సన్(Harley-Davidson), ట్రయంఫ్(Triumph Bike)తో పోటీ పడుతున్నాయి. బైకుల్లో రారాజుగా చెప్పుకునే రాయల్ ఎన్ఫీల్డ్ క్రేజ్‌కు వెనుకున్న 10 విశేషాలను తెలుసుకుందాం.
భారతీయ బ్రాండ్
1901లో తండ్రికొడుకులు కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ ప్రారంభించారు. వారిద్దరి పేర్లూ జార్జ్ టౌన్సెండేనే. అప్పటి వరకు టౌన్సెండ్ కుటుంబం సూదులు తయారు చేసేది. ఈ క్రమంలో కుమారుడికి సైకిళ్లు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత 1901లో సైకిల్‌కు 239-సీసీ ఇంజిన్‌ను అమర్చి.. తొలి బైక్‌కు రూపకల్పన చేశారు.
సుదీర్ఘ కాలంలో ఈ మోటార్ సైకిల్ బ్రాండ్ ఎంతోమంది యజమానుల చేతులు మారింది. ఈ క్రమంలో 1970 నాటికి యూకేలో ఈ బైక్‌లకు డిమాండ్ పడిపోయింది. భారత్‌లో మాత్రం ఈ బ్రాండ్‌కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బ్రాండ్‌ను మన దేశంలోని ఐషర్ మోటార్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడే తయారు చేసి.. ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ పూర్తిస్థాయి భారత బ్రాండ్‌గా మారిపోయింది.
గన్ మేకింగ్ నుంచి ఆ బైక్‌కు పేరు..
19వ శతాబ్దం చివర్లో.. 20వ శతాబ్దం ప్రారంభంలో.. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్ కంపెనీ చేతిలో ఉండేది. ఆ తర్వాత రాలీ అనే సంస్థ హస్తగతం చేసుకుని బ్రాండ్‌ను రాయల్ స్మాల్ ఆర్మ్స్ ఫ్యాక్టరీలోనూ భాగం చేసింది.
ఈ సంస్థ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తయారు చేసేది. ఈ క్రమంలోనే క్రమంలో బైక్‌కు బుల్లెట్ అనే నామకరణం చేశారు. అలా 1931లో తొలి బుల్లెట్ బైక్ తయారైంది. ఇంకా అదే సంప్రదాయం కొనసాగుతోంది.
ఫిరంగి ఆకారంతో..
అసలైన రాయల్ ఎన్ఫీల్డ్ లోగోలో ఫిరంగి ఉంటుంది. 'తుపాకీలా తయారైంది.. బుల్లెట్లా దూసుకెళుతుంది' అనేది ఉపశీర్షిక. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లను సరిగ్గా గమనిస్తే ఫిరంగిని పోలి ఉంటుంది.
మిలటరీ సేవలో..
రెండు ప్రపంచయుద్ధాల్లోనూ బ్రిటిష్ ఆర్మీకి సేవలందించిన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ.. ఇప్పటికీ ఆ సర్వీస్‌లో కొనసాగుతోంది. భారత్‌లోనూ ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులకు ఇచ్చే మోటార్‌సైకిళ్లలో ఎక్కువ భాగం రాయల్ ఎన్ఫీల్డ్వే. పోలీస్, మిలటరీ అధికారులు వీటిని అత్యధికంగా వినియోగిస్తారు. ట్రాఫిక్ పోలీసులు సైతం.. హై-స్పీడ్ ఛేజింగ్‌ల కోసం ఉపయోగిస్తున్నారు.
డీజిల్ ఇంజిన్‌తో..
1970ల్లో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ 650సీసీ, 700సీసీలతో పాటు 1000సీసీ ఇంజిన్ కెపాసిటీతోనూ భారత మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. కాకపోతే వాటి ఖరీదు చాలా ఎక్కువ. కాలక్రమంలో నిర్వహణలోపం వల్ల వాటి తయారీని నిలిపివేశారు.
డీజిల్ ఇంజిన్‌తోనూ ఓ వెర్షన్‌ను విడుదల చేశారు. 325సీసీ ఇంజిన్ కెపాసిటీతో ఒక గాలన్ ఇంధనానికి (ఒక గాలన్= 3.78541 లీటర్లు) సుమారు 265 కిలోమీటర్ల మైలేజీ ఆ బైక్ ఇచ్చేది.