తెలంగాణ

telangana

ETV Bharat / budget-2019

బడ్జెట్ 2019 : 'జ్ఞాన భారతమే లక్ష్యం' - Education System

విద్యా ప్రమాణాల్లో మార్పునకు కేంద్రం ప్రణాళికలు రచించింది. ఇందుకోసం బడ్జెట్​లో రూ. 400 కోట్లు కేటాయించింది. నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ద్వారా నూతన ఆవిష్కరణలకు, ఎన్‌ఆర్‌ఎఫ్‌ ద్వారా పరిశోధనల కోసం ప్రోత్సాహకాలు అందించనుంది.

బడ్జెట్ 2019 : 'జ్ఞాన భారతమే లక్ష్యం'

By

Published : Jul 5, 2019, 3:38 PM IST

సీతారామన్​ ప్రసంగం

దేశంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. విద్యాసంస్థల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్​లో రూ. 400 కోట్లు కేటాయించారు. త్వరలోనే నూతన ఉన్నత విద్యావిధానం ముసాయిదా ప్రకటిస్తామని చెప్పారు. ఉన్నత విద్యా బోధన మెరుగుదల కోసం జ్ఞాన్‌ పథకాన్ని తేనున్నట్లు సీతారామన్ తెలిపారు.

పరిశోధనలు, నవకల్పనలపై ఎక్కువ దృష్టిపెట్టనున్నట్లు వివరించారు. పరిశోధనలను ప్రోత్సహించడం సహా సమన్వయం కోసం జాతీయ పరిశోధనా ఫౌండేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ద్వారా నూతన ఆవిష్కరణలకు, ఎన్‌ఆర్‌ఎఫ్‌ ద్వారా పరిశోధనలకు అండగా నిలిచేలా బడ్జెట్​లో కేటాయింపులు చేశారు.

ఏడాదిలో 'ఎడ్యుకేషన్​ కమిషన్ ఆఫ్​ ఇండియా'

ఐదేళ్ల క్రితం ప్రపంచ అత్యుత్తమ 200 సంస్థల్లో భారత్‌ నుంచి ఒక్కటి కూడా లేదని సభకు గుర్తుచేశారు నిర్మల. మోదీ ప్రభుత్వ ఐదేళ్ల నిరంతర శ్రమతో ఇప్పుడు మూడు విద్యాసంస్థలు 200 లోపు ర్యాంకుల్లో ఉన్నాయన్నారు. విద్యాసంస్థలను ఉన్నతీకరించడం ద్వారా విదేశీ విద్యార్థుల రాక మరింత పెరగాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది కాలంలో ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి కౌశల్‌ యోజన ద్వారా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి కోటి మందికి శిక్షణ ఇస్తామని ప్రకటించారు.

క్రీడలకు ప్రాధాన్యం

క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ఖేలో ఇండియా పథకంలో భాగంగా జాతీయ క్రీడల విద్యా బోర్డు ఏర్పాటును ప్రతిపాదించారు. జాతిపిత మహాత్మాగాంధీ సిద్ధాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఎన్‌సైక్లోపీడియా తరహాలో గాంధీపీడియాను అభివృద్ధి చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details