దేశ వ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ప్రత్యేక విధానం రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉపయోగపడేలా నేషనల్ ట్రాన్స్పోర్టు కార్డు తెస్తున్నామని ఆమె తెలిపారు.
భారత్మాల, సాగర్మాల, ఉడాన్ పథకాలు... గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య దూరం తగ్గించనున్నాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఉడాన్ పథకం..
ఉడాన్ పథకంతో చిన్న పట్టణాలకూ విమానసేవలు అందుబాటులోకి వచ్చాయని నిర్మలాసీతారామన్ తెలిపారు.
"ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకూ విమాన సేవలు విస్తరించాం. ఫలితంగా సాధారణ పౌరులకూ విమానాయానం సాకారమవుతోంది. నూతన మెట్రో ప్రాజెక్టులో భాగంగా 2018-19 సంవత్సరానికి గాను 300 కి.మీ మెట్రో మార్గాల నిర్మాణానికి అనుమతి ఇచ్చాం. ఇప్పటికే వివిధ నగరాల్లో 637 కి.మీ మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్త ఏకీకృత రవాణా వ్యవస్థలో భాగంగా నేషనల్ ట్రాన్స్ పోర్ట్ మొబిలిటీ కార్డు ప్రవేశపెట్టాం. దీని ద్వారా ప్రజలు బహుముఖంగా రవాణా ఛార్జీలు చెల్లించవచ్చు. ఈ కార్డుతో దేశంలో ఎక్కడైనా రైల్వే చార్జీలు, టోల్ టాక్స్లను చెల్లించవచ్చు. రూపే కార్డు ద్వారా టోల్ టాక్స్, బస్సు ఛార్జీలను చెల్లించవచ్చు. అదే కార్డుతో షాపింగ్ చేయవచ్చు. ఏటీఎంల నుంచి నగదునూ తీసుకోవచ్చు." - నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి
రైలు మార్గాలు..
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రైల్వేల్లో నూతన విధానం చేపడతామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2018-19 మధ్య 300 కి.మీ మెట్రో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 637కి.మీ మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు.