తెలంగాణ

telangana

ETV Bharat / briefs

2000 కోట్లు.... ఏడు గోపురాలు... 55 అడుగులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆలయాల పునర్​ నిర్మాణ యజ్ఞంలో ఓ అద్భుతం ఆవిష్కరించబోతోంది. ఐదు వందల మందికి పైగా శిల్పుల చేతిలో ఆశ్చర్యపరిచేలా యాదాద్రి సాక్షాత్కరించబోతోంది. మాడ వీధులు, రాజగోపురాలతో యాదాద్రీశుని క్షేత్రం... రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక, ఆహ్లాదకర, పర్యటక సముదాయంగా రూపుదిద్దుకుంటోంది.

yadadri

By

Published : Jun 13, 2019, 6:06 AM IST

Updated : Jun 13, 2019, 10:07 AM IST

యాదాద్రి నిర్మాణంపై ప్రత్యేక కథనం

యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలంలో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయం శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. తెలంగాణ ప్రముఖ ఆలయాలలో చాలా విశిష్టమైంది. స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రం పంచ నారసింహ క్షేత్రం. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన దేవాలయ పునర్నిర్మాణ యజ్ఞం ఓ అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆ బృహత్కార్యానికి పూనుకుంది. రాబోయే రోజుల్లో యాదాద్రి.. ఆధ్యాత్మిక, ఆహ్లాదకర, పర్యటకోత్సాహ సముదాయంగా రూపుదిద్దుకుంటోంది.

2.33 ఎకరాల్లో ప్రధానాలయం

2 వేల కోట్ల వ్యయంతో కూడిన ప్రాజెక్టు ఓ అద్భుత దేవాలయాన్ని కళ్లముందు నిలపబోతోంది. 14 ఎకరాల విస్తీర్ణం కలిగిన కొండ అందుకు అనువుగా అమరింది. 2.33 ఎకరాల్లో ప్రధానాలయ నిర్మాణం. ఏడు రాజగోపురాలు, నాలుగువైపులా మాడ వీధులు, పన్నిద్దరు ఆళ్వారుల మండపాల నిర్మాణాలతో.. యాదాద్రి... నారసింహాద్రిగా వెలుగులీనుతుంది. అందుకు ఇంకెంతో కాలం పట్టదు. ఆ శుభవేళ త్వరలోనే అనిపిస్తుంది ఇక్కడ సాగుతున్న నిర్మాణ వేగాన్ని చూస్తే.

ఐదు వందల మంది శిల్పులు

అత్యంత తక్కువ సమయంలో, అత్యద్భుత నిర్మాణాలతో.. ఆశ్చర్యపరిచేలా సాక్షాత్కరించబోతోంది. ఐదు వందల మందికి పైగా శిల్పుల చేతిలో రూపుదిద్దుకుంటున్న బృహత్‌నిర్మాణం. ప్రధాన ఆలయమైన గర్భగుడి... చుట్టూ గోపురాలు, నలువైపులా ద్రావిడశైలి శిల్ప సంపద... అతికొద్ది రోజుల్లోనే కనువిందు చేయనున్నాయి. గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించడంతో... పనుల్లో వేగం పెరిగింది. ఇంతకుముందు అర ఎకరం స్థలంలో ఉన్న ఆలయాన్ని.. ప్రస్తుతం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా తీర్చిదిద్దుతున్నారు.

తుది దశలో పనులు

ప్రధాన ఆలయ విస్తరణలో ఏడు రాజగోపురాలు నిర్మితమవుతున్నాయి. పశ్చిమ రాజగోపురం 77 అడుగుల్లో రూపొందుతోంది. దీన్ని సప్తతలగా వ్యవహరిస్తున్నారు. అంటే ఏడంతస్తులుగా ఉండబోతుంది. ఇక దక్షిణం, ఉత్తరం, తూర్పు రాజగోపురాలు... 55 అడుగుల్లో నిర్మిస్తున్నారు. వీటిని పంచతల అంటే అయిదు అంతస్తుల రాజగోపురాలుగా పిలుస్తారు. ఈ నాలుగుకాకుండా మరో రెండు మూడంతస్తుల రాజగోపురాలు సిద్ధమవుతున్నాయి. ఇక ఏడోదైన దివ్య విమాన గోపురం 48 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకుంటోంది. ఇది ప్రధాన గుడి గర్భాలయం పైన నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఇవన్నీ తుదిదశలో ఉన్నాయి.

12 మంది ఆళ్వార్ల విగ్రహాలు

ఇక ఆలయంలో 12 మంది ఆళ్వార్ల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి ప్రవేశిస్తుండగా క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక.. ఆళ్వారుల ముందు నుంచి గర్భాలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. రామానుజాచార్యులు, నమ్మాళ్వార్, పెరుమాండ్లాచార్యుల వంటి పన్నెండు మంది వైష్ణవాచార్యుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇలా యాదాద్రి పుణ్యక్షేత్రం... అచ్చెరువొందేలా తయారవుతోంది.

Last Updated : Jun 13, 2019, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details