నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్లు వేసిన పసుపు రైతులు ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఎన్నికలు ఉండటం వల్ల... ఎలా ప్రచారం చేసుకోవాలని ప్రశ్నించారు. జగిత్యాలలో ఏర్పాటు నమూనా పోలింగ్ కేంద్రాన్ని రైతు అభ్యర్థులు పరిశీలించారు. కేంద్రం బయట ఏర్పాటు చేసిన బోర్డులో అభ్యర్థుల, గుర్తుల పేర్లు మాత్రమే ఉన్నాయని.. చిహ్నాల బొమ్మలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తుల రూపాలు కేటాయించకుండా ఎన్నికల అధికారులు చుక్కలు చూపెడుతున్నారని వాపోయారు. ప్రచారానికి సమయం లేనందున ఎన్నికను వాయిదా వేయాలని కోరారు.
రైతు వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పండి!
అన్ని ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయని మండిపడ్డారు. సమస్యల పట్ల ఆందోళన చేస్తే తెరాస సర్కార్ అరెస్టులు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలన్నీ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయన్నారు. మధ్యప్రదేశ్లో భాజపా ప్రభుత్వం ఆరుగురిని పొట్టన పెట్టుకుందన్నారు. రైతు వ్యతిరేక పార్టీలకు ఓటు వేయకుండా... 178 మందిలో ఎవరికో ఒకరికి వేస్తే... తమ ఉద్యమాన్ని సమర్థించిన వారు అవుతారని స్పష్టం చేశారు. ఎంపీ కవిత పసుపు బోర్డు కోసం ప్రయత్నించానని చెప్పి మభ్యపెట్టేందుకు చూస్తోందని విరుచుకుపడ్డారు.