తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎందుకు ఉపవాసజాగరణ? - SHIVARATHRI

పండుగ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి నోరూరించే పిండివంటలు, మిఠాయిలు. శివరాత్రి పండుగరోజు మాత్రం ఏమి తినకుండా ఉపవాసం, జాగరణ చేస్తాం.. ఈ పండుగ శరీరానికి కాదు... మనస్సుకే! అమావాస్య ముందురోజైన కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాం. అసలు ఈరోజు ఎందుకు ఉపవాసం ఉంటాం? జాగరణ ఎందుకు చేస్తారో తెలుసుకుందామా?

ఎందుకు ఉపవాసజాగరణ?

By

Published : Mar 4, 2019, 7:30 AM IST

దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహా శివరాత్రి, యోగ శివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహా శివరాత్రి. మార్గశిర మాసంలో బహుళ చతుర్థి, అర్ధ నక్షత్రం రోజున లింగోద్భవం జరిగింది.

పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న పక్షాన్ని కృష్ణపక్షం అంటాం. ఈ తిథులలో ఒక్కో రోజూ గడిచే కొద్దీ చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. తద్వారా మనుషుల ఆలోచనా తీరు, వారిలోని ఉత్సాహం అమావాస్య నాటికి మందగిస్తాయి. ఇలాంటి సమయంలో దేవుడిపై మనసుని లగ్నం చేయడం వల్ల నిస్తేజంగా ఉన్న మనసు ఉత్తేజితం అవుతుంది. మర్నాడు అమావాస్య కూడా ఉత్సాహంగా సాగిపోతుంది.

శివరాత్రి నాటికి చలి, శివశివా అంటూ వెళ్లిపోతుందంటారు పెద్దలు. రథ సప్తమి నాటికి మొదలయ్యే సూర్యకిరణాల క్షీణత మరుసటి వారం నాటి శివరాత్రికి వేడి నందుకుంటాయి. ఈ సమయంలో చలి, వేడి ఒకేస్థాయిలో ఉంటాయి. ఎండకాలం ఉపవాసం ఉండటం కష్టమే. మరి చలికాలంలో జాగరణ చేయడం సాధ్యం కాదు. ఈ రెండూ ఇష్టంగా చేసేందుకు వాతావరణం అనుకూలించాలి. అందుకే సమశీతోష్ణ స్థితి ఉండేది మహాశివరాత్రినాడే.

శరీరానికి ఆహారాన్ని అందిస్తున్నంతసేపూ.. అది సుఖంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనస్సు కూడా నిస్తేజంగా ఉంటుంది. ఒక్కరోజు శరీరానికి ఆహారం అందించకపోతే... నేనంటూ ఉన్నానంటూ అది మనకి గుర్తుచేస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని మనసు విచారణ సాగిస్తుంది. ఉపవాస జాగరణలతో శరీరం, మనసు రెండూ మెలకువతో ఉంటాయి.

ఈ శివరాత్రికి మనమూ మన మనస్సును ఉత్తేజపరిచి.. జీవితాన్ని ఆనందంగా గడుపుదాం.

ABOUT THE AUTHOR

...view details