రాష్ట్రంలో గత రెండ్రోజులుగా ఎండలు మరింత ఎక్కువగా మండిపోతున్నాయి. ఇంట్లో కూర్చోవాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు ప్రజలు. మధ్యాహ్నం వేళ అయితే మరీ అత్యవసరమైతే తప్ప ఇళ్లు కదలట్లేదు చాలా మంది. సూర్యుడి తాపానికి వృద్ధులు, పిల్లలు వడదెబ్బకు గురవుతుంటే... పశుపక్ష్యాదులు ఎండకు విలవిల్లాడి చనిపోతున్నాయి.
నేడు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల 43.8, నిజామాబాద్ 43.4, కరీంనగర్లో 43.3 డిగ్రీలు పెరిగింది. నిన్న ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 46.2 డిగ్రీలుగా నమోదైంది. మే మొదటి వారంలోనే ఎండలు మండిపోతుంటే వచ్చే రెండు వారాలు ఎలా ఉంటాయోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.