తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నవభారతం కోసం భాజపాకు ఓటేయండి: మోదీ - mp

తెలంగాణకు ఎన్నో నిధులు ఇస్తున్నా.. ఇక్కడి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కాకుండా కుటుంబ సంక్షేమానికి పాటుపడుతోందని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ. హైదరాబాద్​లో ఎల్బీ స్టేడియం వేదికగా భాజపా నిర్వహించిన విజయ సంకల్ప్​ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రధాని మోదీ

By

Published : Apr 2, 2019, 6:00 AM IST

Updated : Apr 2, 2019, 7:55 AM IST

ప్రధాని మోదీ
హైదరాబాద్‌ పోరాటాల గడ్డ అని కొనియాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎల్బీ స్టేడియంలో భాజపా నిర్వహించిన సభకు హాజరైన ఆయన తెలుగులో మాట్లాడి ప్రారంభించారు. నవభారత నిర్మాణం కోసం ప్రజలంతా భాజపాకు ఓటు వేయాలని కోరారు. 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా తొలిసారిగా ఇదే స్టేడియంలో నిర్వహించిన సభలో తనను ఆశీర్వదించారని గుర్తు చేశారు.

మజ్లిస్​కు నిద్ర లేకుండా చేస్తా..

కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందన్న కేసీఆర్‌ ప్రశ్నలపై స్పందించిన ప్రధాని... జాతీయ మానిఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఫెర్టిలైజర్‌ కంపెనీ, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. ఇక్కడి ముఖ్యమంత్రి ఓటు బ్యాంకు రాజకీయాలు, కుటుంబ పాలనతో తెలంగాణ అభివృద్ధి చెందదన్నారు. కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతిలో ఉండడం వల్ల ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ఈ చౌకీదార్ మజ్లిస్‌కు నిద్ర లేకుండా చేస్తానన్నారు.

మీ ఆటలు సాగవు..

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలని కాంగ్రెస్‌ మిత్రపక్షం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కోరుతోందని, ఈ అంశంపై మమతా బెనర్జీ, మణిశంకర్‌ అయ్యర్‌, శరద్‌పవార్‌, దేవెగౌడలు సమాధానం చెప్పాలని మోదీ డిమాండ్‌ చేశారు. తాను ఉన్నంత కాలం మీ ఆటలు సాగనివ్వనని అన్నారు. దేశ ద్రోహులకు, దేశ భక్తులకు మధ్య గోడ కట్టి మరీ రక్షిస్తానన్నారు. ఇది కాంగ్రెస్‌ జమాన కాదు మోదీ జమాన అన్న ప్రధాని.. నవభారత నిర్మాణం కోసం ప్రజలంతా సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇస్తే బలమైన శక్తిగా చేస్తామని హామీ ఇచ్చారు.

ఎంతో చేశాం.. ఇంకా చేస్తాం..

ప్రధాని నరేంద్ర మోదీ తన ఐదేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టారు. ముద్ర యోజన పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 15కోట్ల మందికి రుణాలు ఇచ్చామన్నారు. వీరిలో తెలంగాణకు చెందిన యువకులు కూడా ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చేశామన్నారు. ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. రూ. 5 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీ కల్పించామన్నారు.

మై బీ చౌకీదార్..

దేశ రక్షణ కోసం కాపలదారుగా ఉంటానన్న ప్రధాని.. పార్టీ శ్రేణులతో మై బీ చౌకీదార్​ అని నినాదాలు చేయించారు. నరేంద్రుడు ప్రసంగిస్తుండగా భాజపా శ్రేణులంతా మోదీ...మోదీ అంటూ నినదించారు. కాంగ్రెస్‌ నేత, మాజీమంత్రి విజయరామారావు ప్రధాని సమక్షంలో భాజపాలో చేరారు. జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్​రెడ్డితో పాటు భాజపా నేతలంతా హాజరయ్యారు.

ఇవీ చూడండి:'కారు' స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంది: మోదీ

Last Updated : Apr 2, 2019, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details