ఈ ఏడాది ఐపీఎల్ కోసం అటు ఫ్రాంచైజీలతో పాటు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా దాదాపు ఐదు నెలల పాటు ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లు.. లీగ్ నిర్వహణతో మైదానంలో తిరిగి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ సుదీర్ఘ విరామం తర్వాత.. ఆటగాళ్లు ఊపందుకునేలా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు క్రమ పద్దతిలో శిక్షణ పొందుతున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. శనివారం ఫ్రాంచైజీ విడుదల చేసిన ఓ వీడియోలో అతడు మాట్లాడాడు.
"నెలల పాటు విశ్రాంతి తీసుకుని నేరుగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెడితే పలువురు ఇబ్బంది పడ్డారు. ఆటగాళ్ల దేహాలు అలవాటు తప్పాయి. ప్రస్తుతం నిరంతరాయంగా సాధన చేస్తుండడం వల్ల తీవ్రత పెరిగి మునుపటి స్థితిలోకి వస్తున్నారు. మేమైతే ఎవరినీ బలవంతం చేయడం లేదు. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. దాంతో ఆటగాళ్లలో సమన్వయం ఏర్పడింది. తొందర పడి ఒకేసారి భారీ కసరత్తులు చేయాలని అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరికీ తగిన సమయం కేటాయించాం. రాబోయే శిక్షణ సమయంలోనూ అదే చేస్తాం."