తెలంగాణ

telangana

By

Published : May 17, 2019, 6:27 PM IST

Updated : May 17, 2019, 10:58 PM IST

ETV Bharat / briefs

అమ్మో కూర'గాయం'... వాటి కంటే పచ్చళ్లు నయం

కూరగాయలు కొనాలంటే వినియోగదారుడు బెంబేలెత్తుతున్నాడు. మండే ఎండలతో... పెరిగిన ధరలతో సగటు మనిషి ఆందోళన చెందుతున్నాడు. వేసవిలో పంటలు పండక.. పండిన పంటకు గిట్టుబాటు ధరరాక.. దళారుల చేతిలో చిక్కిపోతున్నాడు రైతన్న. కూర'గాయాలు' రైతన్నకు, వినియోగదారునికి ఇద్దరికి చుక్కలు చూపిస్తున్నాయి.

అమ్మో కూర'గాయం'


ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్​ పైగా నమోదవుతుండడం వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కూరగాయలు, ఆకుకూరల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడం వల్ల కూరగాయల సాగు తగ్గిపోయింది. పంటలు ఎండిపోతుండడం... దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి తగ్గిపోవడం వినియోగదారులపై ధరాభారం పెరుగుతోంది.

3వేల టన్నుల కూరగాయలు అవసరం..

రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి రోజుకు సగటున 300 నుంచి 400 గ్రాముల కూరగాయలు వినియోగిస్తున్నట్లు అంచనా. ఈ లెక్కన కేవలం హైదరాబాద్‌ జంట నగరాల పరిధిలో నిత్యం 3 వేల టన్నుల కూరగాయలు అవసరం. ఎక్కువగా టమాటా, పచ్చిమిరప, దుంపలు, ఆకుకూరలు వినియోగిస్తున్నారు. కూరగాయల సాగు విస్తీర్ణం, దిగుబడిలో దేశంలో తెలంగాణ 15వ స్థానంలో ఉంది.

బోసిపోయిన మార్కెట్లు..

కోటి జనాభా కలిగి విశ్వనగరంగా ఖ్యాతిగాంచిన హైదరాబాద్‌లో ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బోయినపల్లి, మెహదీపట్నం, కొత్తపేట, వనస్థలిపురం తదితర రైతుబజార్లన్నీ రద్దీ తగ్గిపోయి నాణ్యత లేమి కూరగాయలే దర్శనమిస్తున్నాయి. కూరగాయలు అధిక విస్తీర్ణంలో సాగయ్యే రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటడం వల్ల రైతులు సాగుకు దూరంగా ఉన్నారు.

జులై వరకు ధరల పెరుగుదల...

ధరల పెరుగుదల జులై దాకా కొనసాగే అవకాశం ఉందని ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖలు అంచనా వేస్తున్నాయి. టమాట కిలో 50 నుంచి 60 రూపాయలు, పచ్చిమిర్చి 60 రూపాయలు... ఇలా ఏ పంట తీసుకున్నా సరే ధరలు మండిపోతున్నాయి. ఇదే సాకుగా తీసుకుని దళారులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు.

పచ్చళ్లే నయం..

పెరిగిన ధరలతో మార్కెట్లలో కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొందని వినియోగదారులు వాపోతున్నారు. బూడిద గుమ్మడి కాయ రూ.100, బీన్స్ రూ. 100, గోరుచిక్కుడు రూ.40... ఇలా ఏవి కొనాలన్నా ధరలు భగ్గుమనడం వల్ల వినియోగదారులు బేజారెత్తిపోతున్నారు. సగటు మధ్యతరగతి కుటుంబాలు కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది. ఇక పచ్చళ్లు తినే బతకాలంటున్నారు సామాన్యులు.

అమ్మో కూర'గాయం'

ఇవీ చూడండి: హాట్​ సమ్మర్​లో తాగేద్దాం టేస్టీ మాక్​టెల్స్​

Last Updated : May 17, 2019, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details