తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అమ్మో కూర 'గాయం' చేస్తోంది! - vegitables-prices-hike

కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పచ్చిమిరప మంటపెడుతోంది, టమాట కళ్లెర్రజేస్తోంది, చిక్కుడు కాయలైతే అసలు మధ్యతరగతి వారికి చిక్కే పరిస్థితే లేదు. కూర'గాయా'ల ధాటికి సామాన్య ప్రజానీకం అల్లాడుతున్నారు. అంగట్లో అన్నీ ఉన్న కొనే స్థోమత లేదని వాపోతున్నారు వినియోగదారులు.

vegetables

By

Published : Jun 1, 2019, 11:40 AM IST

పెరుగుతున్న కూరగాయల ధరలు

కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకప్పుడు సూపర్ మార్కెట్లలో రూ.50 పలికి.. రైతు బజార్లో రూ.20కే దొరికే కూరలు సైతం... ఇప్పుడు రైతు బజార్లలోనే రూ.60పైగా పలుకుతున్నాయి. వంద రూపాయలు తీసుకుపోతే నిండా రెండు కేజీల కూరగాయలు రావటం లేదు. గత వారం రోజులుగా నగరంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మొన్నటి వరకు కిలో రూ.20 పలికిన టమాటా.. ఇప్పుడు ఏకంగా రూ.60కి చేరింది. పచ్చిమిర్చి రూ.70, ఫ్రెంచ్ బీన్స్ రూ.95, గ్రీన్ ఆనియన్ రూ.100, వంకాయలు రూ.30, కాకరకాయలు రూ.40 పలుకుతూ.... వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

ధరలు పెరుగుదలకు ఉష్ణోగ్రతలే కారణం..!

సాధారణంగా వర్షాకాలం, చలికాలంతో పోలిస్తే వేసవిలో కూరగాయల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఈ సారి మాత్రం వాటి ధరలు ఏకంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు రైతులు. ఓవైపు మండు వేసవి, మరోవైపు పొలాలకు నీరు లేక పంట దిగుబడి తగ్గిపోయిందంటున్నారు. పండిన కాస్త పంటయినా సరిగా ఉంటుందా అంటే అదీ లేదు. కోసిన గంట రెండు గంటల్లోనే ఎండలకు కూరగాయలు తాజాదనం కోల్పోతున్నాయి. 100 మంది తినే వారు ఉంటే పంట మాత్రం 10 మందికి సరిపోయేంతే పండుతోందని రైతులు వాపోతున్నారు.

3 లక్షల టన్నుల కూరగాయలు అవసరం..

ఒక్క భాగ్యనగరంలో నివసించే వారికే సుమారు 3 లక్షల టన్నుల కూరగాయలు అవసరం ఉంది. ఉత్పత్తి మాత్రం అందులో సగం కూడా ఉండటం లేదు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ముఖ్యంగా కర్ణాటక నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. అయినప్పటికీ తగిన మోతాదులో కూరగాయలు లేక ధరలు పెంచక తప్పడం లేదంటున్నారు రైతులు.

పంట లేకపోవటం, పండిన పంట ఎండకు నాశనం కావడం వల్ల కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితి అదునుగా చేసుకుని కొందరు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కూరగాయలను సబ్సిడీ ధరలపై అందించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: ట్రాఫిక్​ కానిస్టేబుల్ అసదుద్దీన్​ ఓవైసీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details