దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో ఆదివారం కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 112కు చేరినట్టు సమాచారం.
కర్ణాటకలో..
కర్ణాటకలో తాజాగా ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కలబురిగి జిల్లా ఆస్పత్రిలో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7కు చేరింది. ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా.. ఐదుగురు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కేరళలో..
కేరళలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ ప్రకటించారు. ఒకరు బ్రిటన్ దేశీయుడు కాగా మరొకరు ఓ వైద్యుడిగా గుర్తించారు. వారు విదేశాల నుంచి వచ్చినట్లు తెలిపారు మంత్రి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది.