గులాబీ పార్టీ గెలుపు జెండా ప్రతీసారి స్థానికేతరులకే పట్టం కడుతున్న సింగరేణి కార్మికులు... ఈ సారి కూడా అఖరి నిమిషంలో బరిలో దిగిన తెరాస స్థానికేతరుడు వెంకటేశ్ నేతకానికే పట్టం కట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎ. చంద్రశేఖర్‌పై తెరాస అభ్యర్థి వెంకటేశ్ నేతకాని భారీ ఆధిక్యంతో విజయ బావుటా ఎగరేశారు. ఈసారి ఎన్నికల్లో 15 మంది పోటీలో ఉండగా... ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపా నుంచి బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు లోక్‌సభకు కొత్తగా పోటీ చేసినవారే కావటం విశేషం.
కారు ప్రయోగం....
గత ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా తెరాస అభ్యర్థి బాల్క సుమన్ కాంగ్రెస్ అభ్యర్థి జి.వివేకానందపై 2 లక్షల 91 వేల మెజార్టీతో గెలిచారు. అనంతరం వివేక్ కూడా తెరాసలో చేరారు. బాల్క సుమన్ ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి విజయం సాధించడం వల్ల లోక్‌సభ అభ్యర్థిత్వం వివేక్‌కు ఖాయమేనని అందరూ ఊహించారు. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ... ఒక రోజు ముందే పార్టీ తీర్థం పుచ్చుకున్న వెంకటేశ్ నేతకానిని ఖరారు చేశారు. నియోజకవర్గ పరిధిలో రామగుండం నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి చేరికతో తెరాస బలం ఆరుకు చేరింది. దీనికి తోడు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు సింగరేణిలో కారు జోరును పెంచింది.
'పూర్వ'మే వైభవం...
గతంలో కంచుకోటగా ఉన్న పెద్దపల్లిని గెలిచి పూర్వవైభవం చాటాలనుకున్న కాంగ్రెస్ పట్టుదల ఆవిరైంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ను బరిలో దింపినా... హస్తం నేతల వ్యూహం ఫలించలేదు. తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో భారీ ఆధిక్యతతో జీవన్‌రెడ్డి గెలుపుతో... తమకే అనుకూల పవనాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులకు నిరాశే మిగిలింది.
కమలానికి మళ్లీ నిరాశే...
పెద్దపల్లిలో ఒక్కసారి కూడా గెలవనప్పటికీ... పాగా వేయాలనే ఉద్దేశంతో సింగరేణి కుటుంబానికి చెందిన సోగాల కుమార్‌ను భాజపా పోటీలో నిలిపింది. స్థానికుడు, పాత్రికేయుడిగా స్థానిక సమస్యలపై లోతైన అవగాహన, మోదీ ఇమేజ్ గెలుపు తీరాలు చేరుస్తాయనుకున్న భాజపా నేతల ఆశలు ఆవిరయ్యాయి. ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితం అయింది.
ఇవీ చూడండి: తెలంగాణలో గెలిచిన ప్రశ్నించే గొంతుక