రెండు వినాశకర ప్రపంచ యుద్ధాల్ని ఎదుర్కొన్న తరవాత ఐరోపా దేశాలన్నీ 1962లో ఏకతాటిపైకి వచ్చాయి. రాయితీల ద్వారా వ్యవసాయ రంగానికి అండగా నిలవాలని, ఈ రంగం స్వయంసమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ‘ఉమ్మడి వ్యవసాయ విధానం(సీఏపీ)’ రూపొందించుకున్నాయి. అప్పట్లో తాత్కాలిక చర్యగానే మొదలుపెట్టినా, ఆపై ఇది దీర్ఘకాలిక విధానంగా కొనసాగింది. 1980ల నాటికి మొత్తం ఐరోపా సమాఖ్య (ఈయూ) బడ్జెట్‌లో మూడింట రెండొంతులకుపైగా నిధులు సీఏపీకే దక్కాయి. 2020లో ముగియనున్న ప్రస్తుత విధానం కొనసాగింపుపై రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయోజనాలు పొందుతున్నవారంతా ఈ విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. మేధావులు, పర్యావరణ ఉద్యమకారులు, పన్ను చెల్లింపుదారులు, విశ్లేషకులు మాత్రం సీఏపీని సమూలంగా ప్రక్షాళించాలని, రాయితీలను అరికట్టాలని డిమాండు చేస్తున్నారు.
విమర్శలేమిటి?
ఈయూ జనాభాలో కేవలం 5.4 శాతమే పొలాల్లో పని చేస్తారు. సాగు చేసేవారు ఏటా రెండు శాతం మేర తగ్గిపోతున్నారు. దీనికితోడు ఐరోపావాసులు చాలావరకు నగరాలు, పట్టణాలు, వాటి శివార్లలోనే నివసిస్తున్నారు. ఈయూ జీడీపీలో వ్యవసాయం ఆరు శాతం. ఈయూ బడ్జెట్‌లో సుమారు 40 శాతం వరకు నిధులు ఈ రంగమే పొందుతోంది. టెటేలైల్, నెస్లే తదితర 250 పెద్ద సంస్థలు రాయితీల్లో సింహభాగాన్ని దక్కించుకుంటున్నాయి. చిన్న కమతాలకు నామమాత్రంగా విదిలిస్తున్నాయి. ఈయూలో పశుపోషణ లాభసాటి కాదు. కానీ రాయితీల రూపంలో లాభాలను ఒడిసిపడుతున్నారు. దశాబ్దాల సంక్షోభం తరవాత ఐరోపాకు ఆహారాన్ని సమకూర్చేలా వ్యవసాయదారులను శక్తిమంతం చేయాలన్నదే సీఏపీ వాస్తవ లక్ష్యం. కానీ, వ్యవసాయ రంగం మొత్తంగా రాయితీలపైనే ప్రధానంగా ఆధారపడే దుస్థితి నెలకొంది. 2007-2008 ప్రపంచ ఆహార ధరల సంక్షోభం వ్యవసాయ రాయితీల్ని ఎత్తి వేయాలనే డిమాండును పునరుద్ఘాటించినట్లయింది. వ్యవసాయ రాయితీలే ఆహార ధరలు అడ్డగోలుగా పెరిగిపోవడానికి కారణమవుతున్నాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఇది దుష్పరిణామాల్ని చూపుతోందనే విమర్శలు తలెత్తాయి. ఇదంతా అనైతిక ఆర్థిక విధానాన్ని గుర్తుచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఐరోపాలోని రాజకీయ నేతలు ఈయూ రైతులకు చవకైన దిగుమతుల నుంచి రక్షణ అవసరమని వాదిస్తుంటారు. 2003 నుంచి 2013 మధ్య ఐరోపాలో 25 శాతానికిపైగా వ్యవసాయదారులు ఈ రంగం నుంచి దూరం జరిగారు. చిన్న వ్యవసాయదారులు దెబ్బతినిపోగా, పెద్ద సంస్థలు మరింత శక్తిమంతమయ్యాయి. రెండు శాతం సంస్థలే 30 శాతానికిపైగా ప్రత్యక్ష రాయితీలు సొంతం చేసుకున్నాయి. ఇవి కూడా వ్యవసాయదారులు కాని, కోట్ల రూపాయల ఆర్జన కలిగిన టెటేలైల్, నెస్లే వంటి కంపెనీలు కావడం గమనార్హం.
ఈయూలో అందజేస్తున్న వ్యవసాయ రాయితీలు అధిక సరఫరాలకు కారణమవుతున్నాయి. పాలు మొదలు గోధుమ వరకు భారీస్థాయిలో వచ్చే ఐరోపా వ్యవసాయోత్పత్తుల్ని, రాయితీల ద్వారా తక్కువ ధరల్లో ఆఫ్రికా దేశాల్లో విక్రయిస్తున్నారు. ఈ ఉత్పత్తుల ధరలు చాలా తక్కువగా ఉంటుండటంతో, స్థానిక ఆఫ్రికా రైతులు వీటితో పోటీ పడలేకపోతున్నారు. ఆదాయాలు లేక ఇక్కట్ల పాలవుతూ క్రమంగా వ్యవసాయ రంగం నుంచే వైదొలగుతున్నారు. 1980ల్లో న్యూజిలాండ్ వ్యవసాయ పరిశ్రమలోనూ ఇలాంటి సమస్యలే తలెత్తాయి. ఈయూలో సాగు రాయితీలు అధికారంలో ఉండేవారినే సుసంపన్నం చేయడంతోపాటు, వ్యవసాయ మాఫియా సృష్టికి దారితీసింది. ఈయూ సీఏపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాయితీ కార్యక్రమంగా పేరొందింది. ఇందులో రైతులు, గ్రామీణ వర్గాలకు 6,500 కోట్ల డాలర్లు చెల్లిస్తారు. దీన్ని శక్తిమంతమైన రాజకీయ వర్గాలు తమకు అనుకూలంగా మార్చుకోవడంతోపాటు, భారీ కంపెనీలు ప్రయోజనాల్ని పొందుతున్నాయనే విమర్శలున్నాయి.
ఐరోపాలోని గ్రీన్‌హౌస్ ఉద్గారాల్లో పది శాతం వ్యవసాయం రంగం నుంచి వెలువడేవే. ఇందులో పశువుల వాటా గణనీయంగానే ఉంది. పశువులు వెలువరించే మీథేన్ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో ఒకటి. పశుపోషణకు అండగా నిలిచేందుకు అందించే కొన్ని రాయితీలు పరిస్థితుల్ని మరింత దిగజారేలా చేస్తున్నాయి. నైట్రస్ ఆక్సైడ్‌ను విడుదల చేయడంలో ఎరువులు కీలకపాత్ర పోషిస్తాయి. నైట్రేట్ కాలుష్యం సమస్య పరిష్కారానికి రైతులు ఉత్పత్తి స్థాయులు తగ్గించుకోవాలని ఐరోపా పర్యావరణ అధికారులు సూచించగా, తమ లాభాల్ని తగ్గించే ఎలాంటి నియంత్రణల్నీ అంగీకరించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. నిరుడు పోలాండ్ ప్రభుత్వం మొత్తం దేశాన్ని నైట్రేట్ ముప్పున్న ప్రాంతంగా ప్రకటించింది. దేశంలోని నీటిని వ్యవసాయ పొలాలే కలుషితం చేస్తున్నట్లు గుర్తించింది. రైతులు ఎంతమేర ఎరువుల్ని ఉపయోగించాలనేది సూచిస్తూ, వాటి వినియోగాన్ని పరిమితం చేసే కొత్త ఆదేశాల్ని జారీ చేసింది.
కాలుష్యా కాసారాలు...
ఐరోపాలో పెద్దసంఖ్యలో నదులు, చెరువులు రసాయనాలు తదితర కారకాలతో కాలుష్య కాసారాలుగా మారినట్లు ఓ అధ్యయనం గుర్తించింది. చెరువులు, నదులు, తీరప్రాంత జలాల్లో 40 శాతమే పర్యావరణ ప్రమాణాల మేరకు ఉన్నట్లు తేలింది. కేవలం 38 శాతం జల వనరులే రసాయన కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు గుర్తించారు. వ్యవసాయానికి వాడే నీటిలోని నైట్రేట్లు, లవణీయత, పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకరమైన రసాయనాలు, గనులు, వ్యర్థ నిల్వల కారణంగా భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడుతున్నట్లు వెల్లడైంది. అత్యంత సాధారణ కాలుష్య కారకాల్లో పాదరసం(మెర్క్యురీ) ఒకటిగా నిలిచింది. గనుల తవ్వకం, బొగ్గు మండించడం, ఇతర పారిశ్రామిక కార్యకలాపాలు ఇందుకు కారణమవుతున్నాయి. మరోవైపు వ్యవసాయ కార్యకలాపాల్లో పోషకాల వినియోగం పెరగడం, వ్యర్థ జలాల శుద్ధి తదితర కార్యకలాపాల వల్ల ఉపరితల జలాలు కాలుష్యం బారిన పడుతున్నాయి. జర్మనీ, చెక్ రిపబ్లిక్, హంగరీ వంటి మధ్య ఐరోపా దేశాల్లో 90 శాతానికిపైగా జలవనరులు ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించారు. ఇంగ్లాండ్‌లో సైతం చాలా జలవనరులు అధ్వాన స్థితిలోనే ఉన్నాయి. స్వీడన్, ఫిన్లాండ్ వంటి స్కాండినేవియన్ దేశాలు, స్కాట్లాండ్‌ల పరిస్థితి మాత్రం అత్యుత్తమంగా ఉన్నట్లు తేలింది.
అభివృద్ధి చెందిన దేశాల్లో అందిస్తున్న వ్యవసాయ రాయితీలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని రైతుల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి దేశాల్లోని రైతులు ప్రపంచ విపణిలో పోటీపడటం కష్టమవుతుంది. అత్యంత తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం అత్యధిక జీడీపీ వాటా వ్యవసాయ రంగానిదే కావడం వల్ల రాయితీలు ఇలాంటి దేశాలకూ హాని తలపెట్టే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో రాయితీలతో కూడిన వ్యవసాయం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వృద్ధికి అతిపెద్ద అడ్డంకిగా మారుతుంది. ఇది గ్రామీణ పేదలకు ఆరోగ్యం, రక్షిత నీటి సరఫరా, విద్యుత్తు సరఫరాపై మౌలిక సదుపాయాల కోసం పెట్టే పెట్టుబడులకు సంబంధించిన ఆదాయాలపై పరోక్ష ప్రభావమూ చూపుతుంది. చాలా వరకు వ్యవసాయంపై ఆధారపడిన అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈయూకు తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయకుండా సీఏపీలోని రాయితీలు అడ్డంకిగా మారడం వంటి సమస్యలున్నాయి. ఈ క్రమంలో రాయితీల్ని తొలగించేందుకు జరిగిన యత్నాలు ఫలించలేదు. అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రాయితీలను తొలగించేందుకు నిరాకరించడంతో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) దోహా చర్చలు నిలిచిపోయాయి. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు సానుకూల దృక్పథం వ్యవహరించడం ప్రపంచ వ్యవసాయరంగానికి, ఆహార భద్రతకు ఎంతో మేలు చేస్తుంది.
పర్యావరణంపై ప్రతికూల ప్రభావం...
అడ్డగోలు రాయితీల ఫలితంగా భారీ కంపెనీలు ఎరువులు, పురుగుమందులు, ఇతర రసాయనాల్ని ఎక్కువ మోతాదుల్లో వాడేస్తున్నాయి. ఫలితంగా నేల, జల, వాయు కాలుష్యాలు పెచ్చరిల్లుతున్నాయి. అన్ని రకాల జీవులపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. యూకేలో కాలుష్య సంబంధ మరణాలు పెరిగి, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఎరువులు తక్కువగా ఉపయోగించేలా రైతులకు నచ్చజెప్పే అవకాశం ఉన్నా- మొత్తంగా ఇదే సమస్యను పరిష్కరిస్తుందని చెప్పలేం. ఏడు ఈయూ దేశాల్లోని సగానికిపైగా వ్యవసాయ క్షేత్రాల్ని పరీక్షించగా అత్యధిక స్థాయిలో అమోనియా విడుదలవుతున్నట్లు తేలింది. ఈ క్షేత్రాలకు భారీస్థాయిలో వ్యవసాయ రాయితీలు అందుతున్నాయి. ఎరువుల నుంచి వెలువడే అమోనియా ప్రవాహం నదులు, చెరువులు, సముద్రాల్లో ఆల్గే(నాచు) వేగంగా పెరిగేందుకు కారణమైంది. ఫలితంగా మొక్కలు, జంతువులకు సరైన రీతిలో ప్రాణవాయువుల ఆమ్లజని అందకుండా అడ్డం పడింది. ఈ దేశాల్లోని 2,374 పశువుల క్షేత్రాల నుంచి భారీస్థాయిలోనే అమోనియా వెలువడింది. ఇందులో 1,209 క్షేత్రాలు రాయితీ చెల్లింపుల్ని పొందినవే. బాల్టిక్ సముద్రంలో అదనంగా పేరుకున్న నైట్రోజన్, ఫాస్ఫరస్ ఆల్గే పెరుగుదలను తీవ్రతరం చేసి జీవుల మనుగడకు ముప్పుగా పరిణమించింది. అధిక రాయితీల వల్ల వ్యవసాయంలో ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా వాడటం కారణంగా నేలలు విషపూరితమై, పక్షులకు ఆహారం కరవవుతోంది. ఎరువులు, పురుగు మందులతో వెలువడుతున్న కాలుష్యం- పక్షులు, సీతాకోక చిలుకలు, కీటకాలు, తేనెటీగల అంతర్ధానానికీ కారణమవుతోంది. వ్యవసాయ రాయితీలు పక్షుల సంతతి తగ్గిపోవడానికి కారణమవుతున్నట్లు, సాగు భూముల్లో జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు 2004లో శాస్త్రవేత్తలు విడుదల చేసిన రెండు నివేదికలు స్పష్టీకరించాయి.
- పరిటాల పురషోత్తం (రచయిత- సామాజిక, ఆర్థిక విశ్లేషకులు)
ఇదీ చూడండి: 'మోదీజీ... వారితో మాట్లాడే ధైర్యం ఉందా?'