రాష్ట్రంలో రాయితీ విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతుల అవసరాల నిమిత్తం వ్యవసాయ శాఖ 7.5 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రాయితీపై పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 1.4 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 2.8 లక్షల క్వింటాళ్ల వరి, 2 లక్షల క్వింటాళ్ల సోయాబీన్, 35 వేల క్వింటాళ్ల పప్పుధాన్యాలు, 13 వేల క్వింటాళ్ల నూనెగింజలు, 80 వేల క్వింటాళ్ల మొక్కజొన్న, వెయ్యి క్వింటాళ్ల చిరుధాన్యాల విత్తనాలు సరఫరా చేయనుంది. ఇందుకు అనుగుణంగా విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన విత్తనాలను నోటిఫైడ్ విత్తన విక్రయ కేంద్రాల ద్వారా సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. 804 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, 106 ఆగ్రో సేవా కేంద్రాలు, 44 జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు, 66 మన గ్రోమోర్ విక్రయ కేంద్రాలు ఉన్నాయి.
భూసారం పెంపొందించుకునేందుకు పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ 65 వేల క్వింటాళ్లు, జనుము 17 వేల క్వింటాళ్లు, 4 వేల క్వింటాళ్లు పిల్లిపెసర ఇప్పటికే విత్తన కేంద్రాల్లో సిద్ధంగా ఉంచింది. పచ్చిరొట్ట విత్తనాలపై 65 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2.58 క్వింటాళ్ల వరి విత్తనాలు వానా కాలంలో సరఫరా చేయడానికి కూడా ఏర్పాట్లు చేసింది. కొత్త వండగాలైన తెలంగాణ సోనా - ఆర్‌ఎన్‌ఆర్-15048, కూనారం సన్నాలు - కేఎన్‌ఎం-118, బతుకమ్మ - జేజీఎల్-18047 రకాలపై వెయ్యి రూపాయల రాయితీ ఇవ్వనుంది. పాత రకాలైన ఎంటీయూ-1001, ఎంటీయూ-1010, బీపీటీ-5204, ఎంటీయూ-1061 రకాలపై క్వింటాల్‌కు 500 రూపాయల చొప్పున రాయితీ కల్పిస్తుంది.