రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 18న సమావేశం కానుంది. దాదాపుగా నాలుగు నెలల తర్వాత కేబినెట్ భేటీ కానుంది. నూతన పురపాలక, రెవెన్యూ చట్టాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. చట్టాల ఆమోదం కోసం శాసనసభ సమావేశాల నిర్వహణ కూడా ప్రస్తావనకు రావచ్చు. ఆసరా ఫించన్ల పెంపు, రైతుబంధు సాయం పెంపు, ఉద్యోగులకు డీఏ పెంపు తదితర నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.
రైతు రుణమాఫీ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. లక్ష రూపాయల్లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం... అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలను రాష్ట్రానికి అప్పగించినందున నూతన సచివాలయం, శాసనసభ భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటిపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.