రుచికరమే కాదు ఆరోగ్యం కూడా...! మండే వేసవిలో... ఏం తినాలన్నా కడుపుబ్బరం... తినకపోతే నీరసం. అందుకే ఈ సీజన్‌కి పానీయాలే చక్కని ప్రత్యామ్నాయం. అందులోనూ ఆరోగ్యంపై శ్రద్ధతో సహజసిద్ధ పానీయాలకే మొగ్గుచూపిస్తున్నారు. కోల్డ్ కాఫీకి కూల్‌గా బై చెప్పి..... కూల్‌డ్రింక్స్‌ని సాఫ్ట్‌గా పక్కకి జరిపి... మాక్టెల్స్ వైపు అడుగులు వేస్తున్నారు నేటితరం. ఎలాంటి హానికారక ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ లేకుండా పండ్ల రసాలతో చేసేదే ఈ మాక్ టెల్స్. అటు ఆరోగ్యం ఇటు.. రుచికరం అంటూ మాక్టైల్స్ని కాక్‌టెల్ కంటే ఇష్టంగా తాగేస్తున్నారు.
రుచికరమే కాదు ఆరోగ్యం కూడా...!
రాస్ బెర్రీ, బ్లూ బెర్రీ, స్ట్రా బెర్రీ, క్రాన్ బెర్రీ, బ్లాక్ బెర్రీ ని మిక్స్ చేసి ... పైన కొంచెంగా ద్రాక్ష రసాన్ని ఉంచి చేసే ఫైవ్ బెర్రీ సోబెర్ సంగ్రియా వంటి మాక్టైల్స్ని యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలా కేవలం బెర్రీలే కాదు... మామిడి మొదలు అరటి వరకు వివిధ రకాల ఫలాలకి తోడు ఎలాంటి ఆల్కహాల్స్ లేని జ్యూస్‌లను కలిపి చేసే ఈ మాక్టెల్స్ని లొట్టలేస్తూ ఆస్వాదిస్తున్నారు. చూసేందుకు అందంగా... నోటికి రుచికరంగా ఉండటమే కాదు తమ ఆరోగ్యానికి కూడా ఈ పానియాలు మంచివేనంటున్నారు యువత.
చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికి వాటి మజా చూపిస్తున్నాయి మాక్టెల్స్. పెరుగుతున్న డిమాండ్‌ని అందిపుచ్చుకుంటున్న పలు కేఫ్‌లు, రెస్టారెంట్లు వివిధ రకాల మాక్టెల్స్ని తయారుచేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ సిప్పెయ్యండి మరీ...!
ఇవీ చూడండి: పట్నంలో పల్లె... ఆడుకుందామంతా చిన్నపిల్లలమల్లె