కలంకారి అచ్చు యంత్రాలు అలిసిపోతున్నాయి కలంకారి... ఓ పురాతన కళ. వెదురుతో చేసిన కలంతో సహజ సిద్ధమైన రంగుల్ని ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే కళ. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టిన కలంకారి... కృష్ణా జిల్లా మచిలీపట్నం, పెడనలో ప్రసిద్ధి గాంచింది. పెడన కలంకారి పరిశ్రమకు పుట్టినిళ్లు. 80 శాతం కుటుంబాలు ఈ పరిశ్రమపైనే ఆధారపడ్డాయి. చేతితో అచ్చు వేస్తూ అందమైన వస్త్రాలు తయారు చేయడం ఇక్కడి కార్మికుల ప్రత్యేకత. దేశ విదేశాల్లోనూ ఈ వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
సహజ రంగులు
కలంకారి కళలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది... సహజ సిద్ధంగా తయారు చేసే రంగులు. ఎలాంటి రసాయనాలు వాడకుండా కూరగాయలు, ఇతర పదార్ధాలతో విభిన్న రంగులు తయారు చేసి వస్త్రానికి అద్దుతారు. శ్రీకాళహస్తిలో సుమారు 2 వేల కుటుంబాలు, పెడనలో 3వేల కుటుంబాలు దీనిపై ఆధారపడి పనిచేసేవి. ప్రస్తుతం చాలా మంది కళాకారులు వ్యవసాయం, ఇతర పనుల వైపు మళ్లడంతో ఈ కళ అదృశ్యమయ్యే జాబితాలో చేరింది.
దూరం అవుతున్నారు
ముడి పదార్థాల ధరలు రోజు రోజుకీ పెరగడం... అందుకు అనుగుణంగా ఆదాయం రాకపోవడంతో పరిశ్రమ గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటోంది. ఉత్పత్తి చేసిన వస్త్రాలకు మార్కెట్లో గిరాకీ, సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడం వల్ల ఉత్పత్తిదారులకు నష్టాలు వస్తున్నాయి. కార్మికులకూ ఆశించిన వేతనాలు ఇవ్వలేని పరిస్ధితి నెలకొంది. ఫలితంగా ఒక్కొక్కరుగా కళంకారి వస్త్రాల తయారీకి దూరమవుతున్నారు.
ప్రభుత్వం చొరవచూపాలి
అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన కలంకారి హస్తకళ పరిశ్రమ... గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఓ దశలో వెలుగు వెలిగిన ఈ కళ... ప్రస్తుతం కళతప్పి.. వెలవెలబోతోంది. ప్రభుత్వ నిరాదరణ కారణంగా... కార్మికులు వలసబాట పట్టడం.. సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో.. వృత్తికి స్వస్తి చెప్పే పరిస్థితులు వచ్చాయి. కలంకారిని లాభాల బాటలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చొరవ చూపాలని కార్మికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: అక్షరాలే చిత్రాలైతే... ఆ కళాఖండాలే కథలైతే!