ఓ వైపు వేసవి ఠారెత్తిస్తోంది... బయటికెళ్లాలంటేనే భయమేస్తోంది. మరోవైపు సెలవులు ముగింపు ముంచుకొస్తోంది... సమయమంతా వృథా అయిపోతోంది. ఇటువంటి సమయంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది కైలాసగిరి. విశాఖలో సముద్ర మట్టానికి 350 అడుగుల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతం ఆహ్లాదానికి నెలవుగా నిలుస్తోంది. ఇక్కడి నుంచి సముద్రాన్ని చూస్తే... నింగి, నేలా కలుసుకున్నాయేమో అనిపిస్తుంది.
సాయంత్రం సరదాగా...
భానుడి భగభగలతో పగలంతా విసిగిపోతున్న విశాఖ ప్రజలు సాయంత్రం అలా సాగర తీరానికో లేదా కైలాసగిరికో వెళ్లి సేదతీరుతున్నారు. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. పచ్చని చెట్లు, ప్రకృతి అందాల మధ్య గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడకి వెళ్తే.. మనసును తేలికపరిచే చల్లని గాలి ఆహ్లాదాన్ని పంచుతుంది. పెద్దలు సాగర తీర ప్రాంత అందాలను ఆస్వాదిస్తుంటే... పిల్లలు అక్కడి ఉద్యానవనాల్లో ఆటలాడుతూ సరదాగా గడిపేస్తున్నారు.