నకిలీ విశ్వవిద్యాలయం కేసులో అమెరికాలో పట్టుబడ్డ విదేశీ విద్యార్థులను సరైన రీతిలో విచారించాలని 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ' అధికారులను కోరారు అమెరికా చట్టసభ్యులు.
అధికారులు యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని భారతీయ అమెరికన్ రాజా క్రిష్టమూర్తి నేతృత్వంలోని చట్టసభ్యులు కోరారు.
ఈ మేరకు డీహెచ్ఎస్(డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ), ఐసీఈ(యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) లకు లేఖ రాశారు. అధికారులు పూర్తి వివరాలు పంచుకోవాలని, భారత విద్యార్థుల సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరారు.
"విదేశీ విద్యార్థులను సరైన పద్ధతిలో విచారించాలి. చట్టపరంగా అన్ని హక్కులు వారికి కలిగించాలని డీహెచ్ఎస్, ఐసీఈని కోరాం. నేరం చేయని వారు న్యాయవాదులను కలిసే వెసులుబాటుతో పాటు బెయిల్‌పై విడుదలయ్యే అవకాశం కల్పించాలనీ స్పష్టం చేశాం. భారతీయ విద్యార్థుల పూర్తి సమాచారం అందించి, విద్యార్థులు భారత దౌత్య అధికారులతో మాట్లాడేలా చూడాలని డీహెచ్ఎస్, ఐసీఈకి విన్నవించాం."
- రాజా క్రిష్ణమూర్తి, అమెరికా చట్టసభ్యుడు
మిషిగాన్‌లో నకిలీ విశ్వవిద్యాలయమైన 'యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్' కేసులో గత నెలలో 129 మంది భారతీయ విద్యార్థులను డీహెచ్ఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా వేల మైళ్ల దూరం నుంచి అమెరికాలో చదువుకోవాలని వచ్చిన వారి జీవితాలు అయోమయంలో పడ్డాయి.