దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు 240 శ్రామిక్ రైళ్లను నడిపింది. జోన్ మీదుగా నడిచిన 648 శ్రామిక్ రైళ్లలో దక్షిణ మధ్య రైల్వే 960 క్యాటరింగ్ సేవలను అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. జోన్ నడిపించిన, జోన్ మీదుగా వెళ్లిన రైళ్లకు సంబంధించిన కేటరింగ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించాయని ద.మ.రైల్వే వెల్లడించింది. ఎన్జీఓలు, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం ముందుకు వచ్చి రైల్వేలతో భాగస్వామ్యమై... ఆహారం తయారీ, వితరణ బాధ్యతలను తీసుకుని సేవలు అందించాయని పేర్కొంది.
ఐఆర్టీసీతో స్వచ్ఛంద సంస్థలు..
స్వచ్ఛంద సంస్థలు ఐఆర్టీసీ, రైల్వే ఇచ్చే ఆహార పదార్థాలకు అదనంగా అల్పాహారం, భోజనం, రాత్రి సమయంలో ఉపాహారం, పండ్లు, నీరు అందించాయి. ఇప్పటి వరకు 16 ప్రధాన రైల్వే స్టేషన్లలో, 80 శ్రామిక్ రైళ్ల ప్రయాణికులకు 1.5 లక్షల భోజనాలు అందాయి. సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్, రాజమండ్రి, రాయనపాడు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, గుంతకల్లు, రాయ్‌చూర్, ఔరంగాబాద్, పర్బనీ, నాందేడ్, నిజామాబాద్, కర్నూల్, గుంటూరు రైల్వే స్టేషన్ల్లో ఆహార పదార్థాలను అందించారు. స్వచ్ఛంద సంస్థలకు తోడుగా రైల్వే అధికారులు, సిబ్బంది కూడా సేవ చేసేందుకు వ్యక్తిగతంగా ముందుకు వచ్చారని రైల్వే శాఖ వివరించింది.
ఇవీ చూడండి : 2 లక్షల 'ఆటో' ఉద్యోగాలకు కరోనా గండం!