తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆటిజం పిల్లలకు ఆమె అమ్మ - పినాకిల్

ఓ తల్లి మానసిక ఎదుగుదల లేని పిల్లలకు అన్నీ తానై మరో అమ్మలా మారింది. మానసిక జబ్బుతో బాధపడుతున్న తన కుమారుడిలాంటి మరెందరో బిడ్డల కోసం రీహాబిలిటేషన్ కేంద్రాన్ని ప్రారంభించి ఎందరికో అమ్మ అయింది. మరెందరికో ఆదర్శమయింది.

ఆటిజం పిల్లలకు ఆమె అమ్మ

By

Published : May 12, 2019, 5:50 PM IST

Updated : May 12, 2019, 7:54 PM IST

మానసిక ఎదుగుదల లేని పిల్లలకు అన్నీ తానైన మరో అమ్మ

అమ్మను మించిన దైవమున్నదా.. అంటూ మాతృమూర్తి గొప్పతనాన్ని వర్ణించాడో రచయిత. పేగు తెంచుకు పుట్టే బిడ్డ మీద తల్లి ఎక్కడలేని మమకారాన్ని పెంచుకుంటుంది. బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుంటే మాతృమూర్తి వేదన మాటల్లో చెప్పలేం. చిన్నారులను మామూలు మనుషులను చేయాలని అనునిత్యం తపిస్తుంటారు. అలాంటి వారి కోసం ఓ తల్లి ఏర్పాటు చేసిన రీహాబిలిటేషన్ కేంద్రమే... పినాకిల్ బ్లూమ్స్. మానసిక ఎదుగుదల లేని పిల్లల కోసం పనిచేస్తూనే.. నిరుపేదలకూ ఉచితంగా థెరపీలను అందిస్తోంది పినాకిల్ బ్లూమ్స్.

ఆటిజం పిల్లల కోసం..

హైదరాబాద్​కు చెందిన శైలజా సిరిపల్లి తన ఐదేళ్ల కుమారుడిలో ఏదో లోపం ఉందని గుర్తించింది. బిడ్డ ఆరోగ్యాన్ని మూమూలు స్థితికి తేవాలనుకుంది. అమ్మా అని పిలిపించుకోవాలని ఎంతగానో తపించినా.. లాభం లేకపోయింది. ఆటిజం పిల్లల కోసం పినాకిల్ బ్లూమ్స్ సంస్థని స్థాపించింది. దీని ద్వారా పిల్లల్లో మార్పు తీసుకువచ్చి... సాధారణ జీవితాన్ని గడిపేలా ప్రోత్సహిస్తోంది. అత్యంత ఖరీదైన ఇలాంటి థెరపీలు చేయించలేక బాధపడుతున్న తల్లిదండ్రులకూ సేవా ఫౌండేషన్ ద్వారా ఉచితంగానే ఈ సేవలను అందిస్తోంది.

ఏడు శాఖలు..

పినాకిల్ బ్లూమ్స్​కు ఏడు శాఖలున్నాయి. ప్రతి శాఖలో ఆటిజం పిల్లలకి రోజూ నలబై ఐదు నిమిషాలు శిక్షణ ఇస్తారు. వైద్యుల సహాయంతో మాట్లాడే, ప్రవర్తన థెరపీ సహా వివిధ రకాల క్రీడలను పిల్లలకు పరిచయం చేస్తున్నారు. ఫలితంగా చిన్నారులు పినాకిల్​కు వచ్చిన రెండు మూడు నెలల్లోనే మెరుగ్గా కనిపిస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఎందరికో ఆదర్శం..

ప్రపంచ వ్యాప్తంగా సుమారు పది కోట్ల మంది చిన్నారులు ఆటిజంతో బాధపడుతుండగా.. ఒక్క భారత్​లోనే కోటి మందికి పైగా ఉన్నారు. నిత్యం వివిధ రకాల వ్యాధులతో సతమతమయ్యే ఇలాంటి పిల్లలకు పినాకిల్ నిజంగా చక్కని పరిష్కారం. ఆటిజం ఉన్న పిల్లలతో తల్లిదండ్రులు పడే మానసిక వేదన అంతా ఇంత కాదు. అలాంటి వారి ముఖాల్లో చిరునవ్వుతో పాటు మంచి భవిష్యత్తు అందించాలన్నదే పినాకిల్ ధ్యేయమంటున్న శైలజ మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇవీ చూడండి: అమ్మ ఒక మజిలీ కాదు... జీవిత ప్రయాణం

Last Updated : May 12, 2019, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details