కోల్‌కతా టెస్టులో టీమ్‌ఇండియాను ఫాలోఆన్ ఆడించాలన్న కెప్టెన్ స్టీవ్ వా నిర్ణయం తప్పని ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. 2001లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో స్టీవ్ మొండిగా వ్యవహరించాడని వార్న్ తెలిపాడు.
'ఈడెన్‌లో స్టీవ్ మొండితనమే ముంచింది' - షేన్ వార్న్ వార్తలు
2001లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్టులో కెప్టెన్ స్టీవ్ వా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్. అందువల్లే తాము ఓడిపోయామని అన్నాడు.
"అప్పుడు 45 డిగ్రీల ఎండ కాస్తోంది. చాలాసేపట్నుంచి మైదానంలో ఉన్నాం. వికెట్ కఠినంగా తయారవుతుంది. టీమ్‌ఇండియా 9 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో స్టీవ్ బౌలర్ల దగ్గరకు వచ్చి 'మీకు ఎలా అనిపిస్తోంది' అని అడిగాడు. బౌలర్లంతా అలసిపోయామనే బదులిచ్చారు. అయితే వరుసగా 17 టెస్టుల విజయాల రికార్డు కోసం స్టీవ్ మొండిగా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా గెలవడానికి ఫాలోఆన్ మాత్రమే ఏకైక మార్గం. ఒకవేళ మేం మళ్లీ బ్యాటింగ్ చేసుంటే 200 పరుగుల ఆధిక్యాన్ని 450కి పెంచేవాళ్లం. టీమ్‌ఇండియా మ్యాచ్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నించేది. అప్పుడు మ్యాచ్ భిన్నంగా సాగేది. ఆ రోజు స్టీవ్‌ది తప్పుడు నిర్ణయం" అని వార్న్ చెప్పాడు.