వ్యాక్సిన్ తయారీదారులకు న్యాయస్థానాల్లో దాఖలయ్యే వ్యాజ్యాల నుంచి రక్షణ కల్పించాలని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా అన్నారు. ఈ అంశంపై టీకా తయారీదారులు కేంద్రానికి ప్రతిపాదన చేయనున్నట్లు వెల్లడించారు. ఓ వర్చువల్ సదస్సులో పాల్గొన్న పూనావాలా ఈ మేరకు వ్యాఖ్యానించారు.
కొవాక్స్ కూటమి సహా ఇతర దేశాలు దీనిపై ఇప్పటికే మాట్లాడుతున్నాయని చెప్పారు పూనావాలా. వ్యాక్సిన్‌కు సంబంధించి ఏవైనా నిరర్థకమైన వ్యాజ్యాలు దాఖలైనప్పుడు మీడియాలో అనేక అర్థం లేని కథనాలు వెలువడుతాయని పేర్కొన్నారు. దీని వల్ల టీకా విషయంలో ఏదో జరిగిందన్న సందేహాలు వెలువడుతాయని తెలిపారు. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం సరైన సమాచారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై అమెరికా ఇప్పటికే చట్టాన్ని చేసిందని అదర్ పూనావాలా తెలిపారు.
"టీకా తయారీదారులపై అసత్య ఆరోపణలు చేసేవారికి వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం చట్టం చేసింది. మనదేశంలోనూ న్యాయ పోరాటాలకు తావు లేనివిధంగా ప్రభుత్వాలు సహకారం అందించాలి. కోర్టుల చుట్టూ తిరుగుతూ కూర్చుంటే అది మా వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫార్మా కంపెనీలన్నీ దివాలా తీసే స్థితి రావచ్చు."