కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో వచ్చిన సుదీర్ఘ విరామం అనంతరం క్రికెట్‌ను పునః ప్రారంభించాల్సిన అవసరం ఉందని భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. అయితే, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
కరోనా కారణంగా అన్ని రంగాలతో పాటు క్రికెట్ టోర్నీలను తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, ఆంక్షల సడలింపుల్లో భాగంగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న 3 టెస్టుల సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటలో లాలాజలం నిషేధంతో పాటు ఐసీసీ ప్రకటించిన నిబంధనలపై స్పందించారు అజారుద్దీన్. ఇంగ్లాండ్-వెస్టిండీస్ సిరీస్ ప్రారంభమయ్యాకే అన్ని విషయాల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
"బంతిపై లాలాజలం రాయడం నిషేధించడం వల్ల మైదానంలో చాలా కష్టమవుతుంది. నా దగ్గరకు బంతి వస్తే.. వేరొకరికి అందించే ముందు లాలాజలంతో రుద్ది మెరిసేలా చేస్తా. క్రికెట్‌ను పునఃప్రారంభించాలి కానీ, ఈ మార్గదర్శకాలను పాటించడం అంత తేలిక కాదు. ఇంగ్లాండ్- వెస్టిండీస్ మ్యాచ్‌లు జరిగేంత వరకు ఏది సరైనది? ఏది తప్పు అని నిర్ధారించడం కాస్త కష్టమే.
-అజారుద్దీన్, భారత మాజీ క్రికెటర్
"ఓ రకంగా చెప్పాలంటే ఆటగాళ్లు ప్రమాదానికి ఎదురెళ్తున్నారు. తాకకుండా క్రికెట్ ఆడటం కష్టం. ఆటగాళ్లందరికీ ఉన్నది ఒకే ఒక బంతి. దాన్ని అభిమానులూ తాకుతారు. కాబట్టి బోర్డు సభ్యులు వీలైనంత త్వరగా ఈ విషయంపై కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే క్రికెట్‌ను పునఃప్రారంభించాలి. ఎందుకంటే ఆట కంటే ఆరోగ్యం ముఖ్యం" అని అజారుద్దీన్ తెలిపారు.