Retail Inflation Increase: ఆహార వస్తువులు ప్రియం కావడం వల్ల మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ఠమైన 6.95 శాతానికి చేరింది. రిజర్వ్ బ్యాంక్ గరిష్ఠ లక్ష్యమైన 6 శాతాన్ని మించడం వరుసగా ఇది మూడో నెల. వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2020 అక్టోబరులో 7.61 శాతం కాగా, ఆ తరవాత గరిష్ఠ స్థాయి ఇదే. 2022 మార్చిలో ఆహార ద్రవ్యోల్బణం 7.68 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో ఇది 5.85 శాతం. 2021 మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.52 శాతం అయితే, ఆహార ద్రవ్యోల్బణం 4.87 శాతంగా ఉంది. 2022 జనవరి-మార్చి సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 6.34 శాతంగా నమోదైంది.
నూనెలు.. సలసల.. జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నూనెలు, కొవ్వుల విభాగ ద్రవ్యోల్బణం మార్చిలో 18.79 శాతానికి పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు మండిపోవడం ఇందుకు నేపథ్యం. పొద్దుతిరుగుడు పువ్వు నూనె మనదేశానికి ప్రధానంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతి అయ్యేది. కూరగాయల ధరలు 11.64%; మాంసం, చేపల ధరలు 9.63 శాతం ప్రియం అయ్యాయి. దేశీయంగా ఇంధన ధరలు మార్చిలో పెద్దగా పెరగనందున, ఈ విభాగ ద్రవ్యోల్బణం 7.52 శాతంగా నమోదైంది. 2022 ఏప్రిల్ గణాంకాల్లో ఆ ప్రభావం కనిపిస్తుంది.