రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోని స్థిరాస్తి ప్రాజెక్టులకు మూడు లక్షలు అపరాధ రుసుముతో జులై నెలాఖరు వరకు రెరా గడువు పెంచింది. ఎన్ని ప్రకటనలు ఇచ్చినా... హెచ్చరికలు చేసినా... స్థిరాస్తి వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. మొత్తం ఏడు వేలకు పైగా స్థిరాస్థి ప్రాజెక్టులున్నప్పటికీ... రిజిస్ట్రేషన్ చేసినవి కేవలం కేవలం తొమ్మిది వందలు మాత్రమే. సుమారు పదకొండు నెలల గడువు ఇచ్చినా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి స్థిరాస్తి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ చట్టం - రెరా వచ్చిన తరువాత భవన నిర్మాణ ప్రాజెక్టులన్నీ కూడా రెరా పరిధిలోకి వచ్చాయి. దీని ప్రకారం 2017 జనవరి 1 తర్వాత అనుమతి పొందిన ప్రతి ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. 2018 ఆగస్టు 31 అంటే స్థిరాస్తి నియంత్రణ చట్టం అమలులోకి వచ్చే నాటికి సుమారు 4,947 ప్రాజెక్టులు అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,985, హెచ్ఎండీఏ పరిధిలో 640, డీటీసీపీ పరిధిలో 1,122 స్థిరాస్తి ప్రాజెక్టులు ఉన్నాయి.