ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మరో భారీ పెట్టుబడి పెట్టింది. రిలయన్స్ రిటైల్ వ్యాపారాలను మరింత విస్తరించడంలో భాగంగా.. ఆన్లైన్ ఫార్మసీ సంస్థ 'నెట్‌మెడ్స్'లో మెజారిటీ వాటాను (60 శాతం) కొనుగోలు చేసింది.
రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ ద్వారా ఈ వాటా కొనుగోలు చేసినట్లు ఆర్ఐఎల్ ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ రూ.620 కోట్లుగా వెల్లడించింది. దీనితో నెట్‌మెడ్స్ పూర్తి విలువ రూ.1,000 కోట్లకుపైనే ఉన్నట్లు తెలుస్తోంది. విటాలిక్ హెల్త్‌కేర్, ట్రెసారా హెల్త్, నెట్‌మెడ్స్ మార్కెట్ ప్లేస్, దాదాఫార్మా డిస్ట్రిబ్యూషన్స్ వంటివి దీని అనుబంధం సంస్థలే కావడం గమనార్హం.
ఆన్లైన్ షాపింగ్లానే.. ఇటీవలి కాలంలో మందులకు ఆన్లైన్ ఆర్డర్లు పెరిగాయి. నెట్‌మెండ్స్, ఫార్మ్ఈజీ, మెడ్‌లైఫ్ సహా పలు చిన్న చిన్న సంస్థలు మెడిసిన్స్ ఆన్లైన్ డెలివరీ చేస్తున్నాయి. వీటిల్లో పెట్టుబడులు తక్కువగా ఉండటం వల్ల భారీ స్థాయిలో సేవలందించలేకపోతున్నాయి.